రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ఫ్రెంచి డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎఫ్‌డీఏ) ముందుకొచ్చింది. గురువారం సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో యువత అత్యున్నత చదువులకు అవసరమైన నైపుణ్య శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించటానికి ఆర్థిక సాయం చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందని వారు మంత్రికి వివరించారు. అలాగే స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే సృజనాత్మక హస్తకళలకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించటంతో పాటు రైతుల ఆదాయాన్నిపెంచడానికి ఫ్రెంచి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయమందిస్తామని వెల్లడించారు. ఏపీలో బ్లూ ఎకానమీ, స్మార్ట్ గ్రిడ్ నీటివనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, వాటర్ ప్లాంటులు, నీటి సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దడంలో తోడ్పాటునందించాలని ఎఫ్‌డీఏ బృందాన్ని మంత్రి కోరారు.
మంత్రి మేకపాటితో ఫ్రెంచి ప్రతినిధులు భేటీ - ఫ్రెంచి డెవలప్మెంట్ ఏజెన్సీ
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఫ్రెంచి డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎఫ్‌డీఏ) ప్రతినిధులు కలిశారు. ఏపీలో చేపట్టే నైపుణ్య శిక్షణ, వివిధ రంగాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి ఉన్నట్టు వెల్లడించారు.
మరోవైపు రక్షణరంగంలో పెట్టుబడుల ప్రవాహం వచ్చేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో రక్షణరంగ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. డిఫెన్స్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, తయారీ యూనిట్లను నెలకొల్పేలా ముందుకెళ్లాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఢిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 6వ తేదీన లక్నోలో జరిగే రక్షణరంగ సదస్సును వేదికగా మార్చుకోవాలన్నారు.
ఇదీ చదవండి:'మండలికి 22 మంది మంత్రులు రావాల్సిన పనేంటి'