పాపం చిన్నారికి తల్లి లేదు. తండ్రికి దగ్గరనే ఉన్నా ..చెప్పలేని జబ్బేదో ఉంది. వారి ఇద్దరికి తినడానికి తిండిలేదు. పని చేయడానికి ఆ నాన్నకి ఒంట్లో శక్తి లేదు. పాపాకు కడుపునిండా భోజనం పెట్టలేని దయనీయ స్థితిలో ఉన్నాడు.. అలాంటి స్థితిలో ఉన్న వారి దగ్గరికి కొందరు యువకులు వెళ్లి వేధించారు. చిన్నారిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా వారిని స్థానికులు కాపాడారు.
అండగా నిలిచారు..ఆకలి తీర్చారు..! - కోరుకొల్లులో తండ్రీ కూతురు వార్తలు
ఆ చిన్నారి..అమ్మ ఒడి వెచ్చదనం...మమతానురాగం మచ్చుకైనా ఎరుగదు..ముచ్చట చేసి..మురిపెం తీర్చే తండ్రిని అనారోగ్యం వెంటాడుతోంది..ఎక్కడికి వెళ్లాలో..ఏమి చేయాలో తెలియని స్థితిలో..ఓ గ్రామానికి చేరారు..అక్కడ అల్లరి మూకల వేధింపులతో..అదిరి.. బెదిరిపోయారు..అంతలోనే అటుగా..కొందరు ఊరి పెద్దలు అల్లరిమూకలను తరిమి..అసలెవరని అడిగారు..అండగా నిలిచారు..ఆకలి తీర్చారు..ఆరోగ్య కార్యకర్తలకు..విషయం తెలిపారు..అనారోగ్యానికి గురైన ఆ తండ్రిని వైద్యశాలలో.. బిడ్డను బాలసదనంలో చేర్పించారు.
కృష్ణా జిల్లా కోరుకొల్లు ప్రధాన కూడలికి కాస్త దూరంగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు గుమిగూడి ఉన్నారు. ఏదో గొడవ జరుగుతున్నట్లు గమనించిన గ్రామానికి చెందిన అడవి ప్రసాద్, చన్నంశెట్టి సోమేశ్వరరావు, చన్నంశెట్టి మాతారావు, చలమలశెట్టి బాలాజీ, చన్నంశెట్టి శ్రీనివాస్ అక్కడి వెళ్లిచూశారు. కొందరు యువకుల మధ్య ఓ తండ్రీకూతురు బిక్కుబిక్కుమంటూ వణికిపోతూ కనిపించారు. ఐదేళ్ల వయసున్న ఆ పాపను బలవంతంగా తీసుకెళ్లిపోయేందుకు ఆ కుర్రాళ్లు చాలాసేపట్నుంచి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న ఆ పెద్దలు వారిని మందలించి అక్కడి నుంచి పంపించేశారు. తరవాత ఆరా తీశారు. వారి వద్ద ఆధార్ కార్డులు చూసి.. తండ్రి పేరు అడపా రాము, ఎస్‌ఆర్పీఅగ్రహారం, కలిదిండి మండలం, చిన్నారి పేరు అడపా వైష్ణవిదుర్గ, నర్సాపురం, పశ్చిమగోదావరిజిల్లా అని గుర్తించారు. భార్య చనిపోయిందని, తనకి ఆనారోగ్య సమస్యలు ఉన్నాయని రాము చెప్పారు. పెద్దలు ఎస్సై జనార్దన్‌కు ఫోన్ చేయగా, రాత్రికి వారికి బస కల్పించారు. ఉదయం స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త సముద్రవేగి ద్వారా 108కి ఫోన్ చేసి వారిని కైకలూరు సీహెచ్‌సీకి తరలించారు. కలిదిండి అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పి.నాగలక్ష్మి వారిని కైకలూరు నుంచి ఆటోలో ఎక్కించుకొని మచిలీపట్నం తీసుకెళ్లారు. రాము ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంతో అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించామని, చిన్నారిని సంరక్షణార్థం బాల సదనంలో అప్పగించామని నాగలక్ష్మి తెలిపారు.
ఇదీ చూడండి.జలపాతం మధ్యలో చిక్కుకున్న యువకులను కాపాడారు ఇలా..