బండిపై ఎక్కించుకొని నాన్న తనను తిప్పుతుంటే ఆ బాలుడు సంబరపడ్డాడు. ఎదురుగా రైలు వస్తుంటే.. దాన్ని చూపించడానికే తీసుకొచ్చాడనుకున్నాడు. రైలు మరింత దగ్గరగా వస్తుంటే ఆశ్చర్యంగా చూశాడే కానీ.. నాన్న దానికి ఎదురువెళ్తున్నాడనీ.. తన ప్రాణాన్నీ తీసుకెళ్తున్నాడనీ.. అభం శుభం తెలియని ఆ చిన్నారి భావించలేకపోయాడు. కనీసం అలాంటి ఊహ వచ్చే అవకాశం లేని వయసులో.. తండ్రితో పాటు ఆ బాలుడికీ ఈ భూమిపై నూకలు చెల్లిపోయాయి. ఓ తండ్రి మనోవేదన మిగిల్చిన ఈ విషాదం అందరినీ కలిచివేసింది.
ఏడేళ్ల చిన్నారితో కలిసి రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య - Krishna distract latest updates
11:40 October 25
ఆత్మహత్య
ఎన్‌టీఆర్ జిల్లా మైలవరం చిన రామాలయం ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ తన్నీరు రామారావుకు తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి గోపీనంద్ అనే 7 ఏళ్ల బాలుడు, 4 ఏళ్ల వయసున్న మహాలక్ష్మి సంతానం. బీఎడ్ పూర్తి చేసి, ఆదాంపురంలో రేషన్ దుకాణం నిర్వహిస్తున్న రామారావు.. ఏడాది కిందట కుమార్తె మహాలక్ష్మి అనారోగ్యంతో చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఇటీవల భార్యతోనూ వివాదాలు తలెత్తడంతో మరింత కుంగిపోయారు.
మూడు రోజుల కిందట కుమారుడు గోపినంద్, తల్లి దుర్గను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని జి.కొండూరు మండలంలోని చెరువు మాధవరంలోని చిన్నమ్మ ఇంటికి వెళ్లారు. తల్లిని అక్కడే ఉంచి మంగళవారం కుమారుడితో తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణలోని ఎర్రుపాలెం మండలం, రేమిడిచర్ల మొదటి గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రేమిడిచర్ల గేట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని పక్కన పెట్టి, ట్రాక్‌పై వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా కుమారుడితో కలిసి నిలబడ్డారు. రైలు ఢీకొనటంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తండ్రీకొడుకుల మృతదేహాలు ఛిద్రమై విసిరేసినట్లు పడ్డాయి. ఈ ఘటనపై రైల్వేపోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో ఉన్న రామారావు తల్లి.. ఆధారంగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు దూరమవడంతో తల్లడిల్లిపోతోంది. భర్త, ముక్కుపచ్చలారని చిన్నారి దూరమై మృతుడి భార్య విషాదంలో మునిగిపోయారు. కలహాలు పరిష్కరించుకోవడానికి మాట్లాడదామని నచ్చజెప్పామని, ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయామని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతవరకు పట్టాల పక్కన నిలబడి, రైలుకు గార్డు పచ్చజెండాఊపగానే ఎదురెళ్లారని.. చూసిన వారు చెప్పడం కలచివేసిందని బంధువులు బోరున విలపించారు.
ఇవీ చదవండి: