Farmers Problems : ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదు. దీంతో కల్లాల్లోనే ఉన్న పంటలు.. గత నాలుగు రోజులుగా వీడని వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా ఈ అకాల వర్షాలతో వరి, పసుపు, మొక్కజొన్నతో పాటు మామిడి రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేశారు. ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా, ఎన్టీఆర్ రెండు జిల్లాల్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం మొక్కజొన్న కోత దశ, ఆరబెట్టేదశలో ఉంది. కోతకోసి కల్లాల్లో అరబెట్టిన మొక్కజొన్న కొద్దిపాటి వర్షం కురిసినా గింజ మొలకరావడం, ఫంగస్ సోకుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా తడిసి పోవడంతో ఫంగస్ వచ్చి గింజలు నీరుగారిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న క్వింటా 1870 రుపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కానీ పంట తడిసి పోవడంతో కొనే నాధుడే లేరని రైతులు వాపోతున్నారు.
మరిన్ని రోజుల పాటు వర్షాలు కురిస్తే పంటనష్టం మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న సాగుకు ఎకరానికి దాదాపు 35 వేలు ఖర్చు చేశామని, కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న తడిచిపోవడంతో ఈ ఏడాది నష్టాలే మిగులుతాయని రైతులు అంటున్నారు. ఒక్క మొక్కజొన్న రైతులే కాకుండా ధాన్యం, పసుపు, మిరప రైతులు కూడా అకాల వర్షాలతో పాటు మద్దతు ధర లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.
వేలకు వేలు అప్పులు తీసుకువచ్చి వ్యవసాయం చేస్తున్నామని ఈ వర్షాల దెబ్బకు పంటలు తడిసిపోయి పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో కూడా తెలియడం లేదని వాపోతున్నారు. వర్షాలకు ధాన్యం చాలా మేర తడిచిపోయింది. రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు, ప్రైవేట్ వెంచర్లల్లో రైతులు ధాన్యాన్ని పట్టాలపై ఆరబెడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ధాన్యాన్ని కాపాడుకుంటానికి రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రాత్రి, పగలు ఇక్కడే ఉంటున్నామని, ధాన్యం కొనుగోలు చేయడంతో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.