Farmers Problems due to Crop Loss: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో మిగ్‌జాం తుపాను నిండా ముంచిందని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం చాగంటిపాడు, నందమూరు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావంతో కోసిన వరి పనలు నీళ్లలో నానడంతో ధాన్యం పూర్తిగా మొలకొచ్చిందని వాపోయారు.
ఏటా ఇదే పరిస్థితి నెలకొనడంతో వ్యవసాయానికి చేసిన అప్పు తీరడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. తుపాను తీరం దాటి పది రోజులు కావస్తున్నా నేటికీ తమను పట్టించుకున్న అధికారి కానరాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సాగుచేస్తున్న సుమారు 15 ఎకరాల వరి కుప్పలను దున్నాల్సిన పరిస్థితి నెలకొందని బోరున విలపిస్తున్నారు.
పంటల బీమాపై రైతన్నల ఆశలు - పరిహారాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వం
ఎకరాకు 35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టామని, రెండో పంటగా కోతకు ముందే 15 వేల రూపాయలు వెచ్చించి మినుమును చల్లినట్లు అన్నదాతలు తెలిపారు. 1318 రకం విత్తనం వేస్తే ఈ ఏడాది ఎకరాకు 40 బస్తాలు పండిందని, ఆ విధంగా చూసుకుంటే ఎకరాకు రూ.లక్షన్నర చొప్పున మొత్తం 22 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన చెందారు.
పరిహారం అందజేయాలి: తమను ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం నష్ట పరిహారం అందజేయాలని కోరారు. కోసిన వరి కుప్పల్లోని ధాన్యానికి మొలకలు రావడంతో కౌలు రైతులు పెద్దిరెడ్డి నారాయణరావు, ముత్యాల వెంకటేశ్వరరావు, రాజా తదితరులకు చెందిన పదిహేను ఎకరాల కోత కోసిన వరి పొలాన్ని దున్నేశారు.