కృష్ణానదికి వరదొచ్చింది.. పంటలను ముంచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వచ్చారు. పంట నష్టాన్ని కళ్లారా చూశారు. అంచనాలు తయారు చేసి అన్నదాతలకు పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఇది జరిగి 14 నెలలవుతోంది. ఇంతవరకు పరిహారం అందలేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన మళ్లీ కొద్ది రోజుల కిందట వరదొచ్చి పంటలకు నష్టం చేకూర్చింది. రైతులు మళ్లీ నష్టపోయారు.. ఎప్పటిలాగానే ప్రజాప్రతినిధులు పంట నష్టాన్ని చూశారు. పరిహారం అందిస్తామంటున్నారు.
* గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా నదికి భారీగా వరదొచ్చింది.. జిల్లాలో 4,685 హెక్టార్లలో 9,977 మంది రైతులకు చెందిన వివిధ పంటలు నష్టపోయారు. వారికి ~ 8.55 కోట్లు నష్టపరిహారం రావాల్సి ఉంది. అప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. అప్పులు తీరకుండానే మరల ఇటీవల వరద ముంచెత్తడంతో మరోమారు కుదేలయ్యాడు.
* జగ్గయ్యపేట, నందిగామ, చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, కంకిపాడు, విజయవాడ రూరల్ ప్రాంతాలతో పాటు తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో పంటలు ముంపుబారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి, బొప్పాయి, పసుపు, కంద, తమలపాకులు, మామిడి, మిర్చి, పూలతోటలు, కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు 33 శాతం దెబ్బతిన్న వివిధ పంటలపై సర్వే చేసి నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఏడాది దాటినా పరిహారం అందలేదు.
* కొన్ని నెలల కిందట ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాలకు పంట నష్టపరిహారం విడుదల చేసినట్లు జీఓ జారీ చేసినా ఇంత వరకు నగదు రైతుల ఖాతాలకు జమ కాలేదు. ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరద కారణంగా సుమారు 3,975 హెక్టార్లలోని పంటలు మునిగినట్లు అంచనా. దానికి సంబంధించిన పంట నష్టం సర్వే కొన్ని మండలాల్లో ప్రారంభమైంది.