ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Crop Loss: అయ్యా.. ఆదుకోండి.. ప్రభుత్వాన్ని వేడుకుంటున్న అన్నదాతలు

Crop Loss in Krishna District: అకాల వర్షాలు ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులను దడపుట్టించాయి. పొలాలు, రహదారులపై ఆరబెట్టిన ధాన్యం, పసుపు, మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. ఊహించని స్థాయిలో మామిడి పంట నేలరాలి తీవ్ర నష్టం ఏర్పడింది. చేతికొచ్చిన పంటను అమ్మకానికి సిద్ధంగా ఉంచిన సమయంలో కురుస్తున్న వర్షాల దెబ్బకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Crop Loss in Krishna District
Crop Loss in Krishna District

By

Published : May 2, 2023, 9:09 AM IST

అయ్యా.. ఆదుకోండి.. ప్రభుత్వాన్ని వేడుకుంటున్న అన్నదాతలు

Crop Loss in Krishna District: అకాల వర్షాలు ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బకొట్టాయి. అప్పులు చేసి పండించిన పంటలు చేతికొచ్చిన సమయంలో వర్షాల కారణంగా చేజారిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. పంటలు కాపాడుకునేందుకు పట్టాలు కప్పుతున్నా... తడవకుండా ఆపడం రైతులకు సాధ్యం కావడం లేదు. ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం 899.5 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లాలో వెయ్యీ 90.2 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదయింది. అసలే గిట్టుబాటు ధరలు లేక బాధపడుతున్న వేళ,, అకాల వర్షాలు పుండు మీద కారంలా దెబ్బకొడుతున్నాయంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Crop Loss in AP: పంటలు చేతికొచ్చి.. నాలుగైదు రోజులుగా కల్లాలు, రహదారుల పక్కన ఆరబెట్టుకుని... మద్దతు ధర కోసం ఎదురుచూస్తున్న రైతుల్ని.. వర్షాలు కుంగదీశాయి. దీంతో ఉన్న ధర కూడా పడిపోయిందంటూ రైతులు అల్లాడిపోతున్నారు. భారీగా పంట నష్టం ఉన్నా.. లెక్కలు అంచనా కట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని.. దీని వల్ల పరిహారం సరిగ్గా అందే పరిస్థితి లేదని..వాపోతున్నారు. పంటను కప్పి కాపాడుకునేందుకు రైతుల వద్ద సరిపడా పట్టాలు లేకపోవడంతో.. మరింత భారీగా నష్టం ఏర్పడింది.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పొలాలు, కల్లాల్లో ఆరబెట్టిన పంటలు తడిసిపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో... వరుసగా 3సార్లు వర్షాలు కురవడంతో... దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. నందిగామ నియోజకవర్గంలో సోమవారం కురిసిన వర్షానికి మొక్కజొన్న సహా పలు పంటలు తడిసి పాడైపోయాయి.

"రైతులను ముంచడానికి వచ్చింది ఈ వర్షం. మొన్నటి వరకు ఏమి లేదు. తీరా కోతలు వచ్చే సమయానికి వచ్చి మమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ధాన్యం తడిచిన, మొక్క మొలిచినా కొనే స్థితిలో ప్రభుత్వం లేదు. ఈ మిల్లర్లు ఏమో వాళ్లకు నచ్చిన రేట్లు చెబుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వానలు వచ్చి ఆగమాగం చేశాయి. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందా అంటే అది లేదు. అటు ప్రభుత్వంతో, ఇటు మిల్లర్లతో పోరాడలేకపోతున్నాం. ఇంక మేము వ్యవసాయం ఎలా చేయాలి. ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి"-రైతులు

విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు, గొల్లపూడి, రాయనపాడు, పైడూరపాడు, జక్కంపూడి గ్రామాల్లో.. ధాన్యం తడిసి.. రైతులకు నష్టాలే మిగిలాయి. చాలా రోజుల నుంచే ధాన్యాన్ని అమ్మకానికి సిద్ధం చేసి ఉంచినా... కొనేవాళ్లు లేక ఆగిపోయామని.. ఈలోగా పంట వర్షార్పణమయిందని.. రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం యార్డుకు మొక్కజొన్న పంట తీసుకొచ్చిన రైతులు.. వారం రోజులుగా మద్దతు ధర కోసం ఎదురుచూస్తున్నారు. వర్షానికి తడిసిముద్దయిన పంటను ఆరబెట్టుకుంటూ... గిట్టుబాటు ధర వస్తే అమ్ముకోవాలని ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. ఈ దశలో ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడం, మిల్లర్లు తక్కువ ధరకే పంటను కొనేయాలని చూడటం వంటివి మరింతగా కుంగదీస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు, కంకిపాడు, గన్నవరం, పమిడిముక్కల, మోపిదేవి, పెనమలూరు మండలాల్లో వర్షాల వల్ల... అధికంగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాలూ రూపొందించారు. అత్యధికంగా మొక్కజొన్న పంటలు 581.77 హెక్టార్లలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే వరి పంట 124.99 హెక్టార్లు, జొన్న పంటకు.. 18.5 హెక్టార్లలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చేతికొచ్చిన పసుపు పంట కూడా తడిసిముద్దయింది. కంకిపాడు, పునాదిపాడులో వరి పంట భారీగా దెబ్బతింది. వణుకూరులో వరి, జొన్న, మొక్కజొన్న, పసుపు పంటలు వర్షార్పణమయ్యాయి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప వ్యవసాయం కొనసాగించే పరిస్థితిలో లేమంటూ రైతులు తల్లడిల్లిపోతున్నారు.

ప్రభుత్వ బాధ్యతారాహిత్యం.. రైతులకు శాపంగా మారిందని.. తెలుగుదేశం రైతు విభాగం నాయకులు విమర్శించారు. అకాల వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లంచి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details