వ్యవసాయానికి ఆధారమైన విద్యుత్, విత్తనాలు - ఎరువులు, రుణ సహాయం, మార్కెటింగ్ వంటి నాలుగు స్తంభాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని.. రైతు సంఘాలు ఆరోపించాయి. ఉచిత విద్యుత్ పథకం సంస్కరణలపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
రాష్ట్ర ఆర్ధిక స్థితి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని.. ప్రతిరోజు అప్పు తెచ్చుకుంటే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విజయవాడలో అన్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఋణ పరిమితి పెంపు, విద్యుత్ సంస్కరణలకు ముడిపెట్టడం దుర్మార్గమన్నారు. ఉచిత విద్యుత్ పై ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పే మాటలు సహేతుకంగా లేవన్నారు. నగదు బదిలితో ఉచిత విద్యుత్ పథకం ఆచరణలో సాధ్యం కాదని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకంపై మంత్రివర్గం ఆమోదాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.