Jasmine farmers : ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో సుమారు 200ఎకరాల్లో రైతులు మల్లెపువ్వులు సాగు చేస్తున్నారు. ధరల్లో హెచ్చుతగ్గులు సాగుదారులను నష్టాల్లోకి నెడుతున్నాయి. రోజుకో రేటుకి మల్లెపూలు అమ్ముడుపోతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మైలవరం నియోజక వర్గంలో చండ్రగూడెం, మురుసుపల్లె, పుల్లూరు, కొత్తగుడెం, బూడవ, రామచంద్రాపురం, పొందుగుల, వెల్వడం తదితర గ్రామాల రైతులు ప్రధాన పంటగా మల్లెపూలు సాగు చేస్తారు. ఈ రైతులంతా చండ్రగూడెంలోని ఓ ఆలయంలో నిర్వహిస్తున్న మార్కెట్ యార్డ్ కి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పూలను హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, కోదాడ, రాజమండ్రి, వైజాగ్, బెంగళూరు వంటి ప్రాంతాలకు సరఫరా చేస్తారు. హైదరాబాద్ కు రోజూ సుమారు 3 నుంచి 4 టన్నుల మల్లెపూలు సరఫరా చేస్తామని వ్యాపారులు, మల్లెపూలు సాగుచేస్తున్న రైతులు చెబుతున్నారు.
ధరలు రెట్టింపయ్యాయి... గతంలో కూలీ రేట్లు తక్కువగా ఉండేవని... ప్రస్తుతం ఒక మహిళకు మూడు వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇతర పంటలు సాగు చేస్తున్న వారికి సబ్సిడీ పై ఎరువులు, పురుగుమందులను సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. తమకి ఎందుకు అందజేయడం లేదని మల్లెపూల సాగుదారులు, కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎరువులు, పురుగుమందుల ధరలు రెట్టింపయ్యాని ఆవేదన చెందుతున్నారు.