సాంకేతిక లోపాలే తమ పంట కొనుగోలుకు అడ్డంకులని రైతుల ఆందోళన కృష్ణాజిల్లాలో రైతులు ఈ ఏడాది లక్ష ఎకరాలకుపైగా పత్తి పంట సాగుచేశారు. ప్రస్తుతం రైతుల చేతికి వచ్చిన పంటను... ఎకరానికి ఏడు క్వింటాళ్లే అధికారులు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన పత్తిని ఎవరికి అమ్మాలని అన్నదాతలు ప్రశ్నిస్తే... మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారుల నివేదికల మేరకు తాము కొనుగోలు జరుపుతున్నామని... సీసీఐ అధికారులు బదులిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటా పత్తి రూ.4,000 నుంచి రూ.4,500 ధర నిర్ణయించారు. ఈ మార్కెట్‌లో అమ్మడం వల్ల క్వింటాకు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సాఫ్ట్‌వేర్‌లో సమాచారం లేకనే :
వ్యవసాయ శాఖ ద్వారా ఇ-క్రాప్ నమోదు చేశామని సర్కారు ప్రగల్భాలు పలుకుతున్నా... మార్కెటింగ్ శాఖ అధికారులకు ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో రైతుల పూర్తి సమాచారం ఉండటం లేదు. రెండు మూడు గ్రామాల్లో భూములుంటే కేవలం ఒక గ్రామంలో ఉన్నదే సాఫ్ట్ వేర్‌లో నమోదవుతుంది. దీనిపై ఆవేదన చెందిన రైతన్నలు... ధ్రువీకరణ పత్రాలతో ఎండానక, వాననక మార్కెటింగ్ కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పండించిన పత్తి పంట పూర్తి స్థాయిలో సీసీఐ ద్వారా కొనుగోలు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సాఫ్ట్వేర్ లోపాలు సరిచేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: నేర నియంత్రణకు అభయ హస్తం..'సైబర్ మిత్ర'తోనే సాధ్యం