కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట నారు పోసింది మొదలు.. ధాన్యాన్ని అమ్మేంత వరకూ.. కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమ్మిన ధాన్యానికి సకాలంలో డబ్బులందక నానా అవస్థలు పడుతున్నామంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు.
రోజులు గడుస్తున్నా.. సొమ్ములు చేతికి అందలేదు..
అధికారుల లెక్క ప్రకారం నియోజకవర్గంలో వరి సాగుచేస్తున్న రైతులు 3259 మందిగా ఉన్నారు. వీరి నుంచి మొత్తం 24318.120 మెట్రిక్ టన్నుల ధాన్యన్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతానికి రైతులకు అందిన నగదు రూ. 7.81 కోట్లగా తెలిపారు. ఇంకా రైతులకు రావలసిన నగదు రూ. 46.62 కోట్లగా అధికారులు పేర్కొన్నారు. పంట అమ్మి రోజులు గడుస్తున్నా, సొమ్ము చేతికి అందక.. పమిడిముక్కల మండలంలోని రైతులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు.
రంగమారిన ధాన్యం కొనే దిక్కు లేదు..
రంగు మారిన ధాన్యాన్ని కొనే దిక్కు లేక.. కల్లాల్లో పడి ఉన్న ధాన్యం రాశుల వద్దే మొవ్వ మండలంలోని అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. ఫలితంగా ఎంతకైనా అమ్మేందుకు దళారులను ఆశ్రయిస్తున్నారు. అలాగే కౌలు రైతులు పండించిన ధాన్యం శాంపిల్స్‌ను పట్టుకుని కమిషన్ బేరాగాళ్లు, మిల్లర్ల చుట్టూ తిరుగుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా రోజులు గడుస్తున్నాయి తప్ప, వీరి ఆవేదన తీరడం లేదు. ఇప్పటికే చాలా వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టామని, తమ సమస్యలు పరిష్కారం కాకపోతే.. మా పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని రైతులు వాపోతున్నారు.