రైతులు "అడ్డుకున్నారు".. పోలీసులు "లాక్కెళ్లారు" - darna
పవర్‌గ్రిడ్ లైన్‌లో భూమి కోల్పోయే రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే లైన్ వేయడాన్ని నిరసిస్తూ రైతులు పనులను అడ్డుకున్నారు. ఈక్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కృష్ణాజిల్లా నందిగామ మండలం కేతవీరనపాడు వద్ద పవర్‌గ్రిడ్ లైన్ పనులను రైతులు అడ్డుకున్నారు. పోలీసులు రైతులను అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైతులు భారీగా రావడంతో... పోలీసులు సైతం అదేస్థాయిలో వచ్చారు. ఈక్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. గతంలో రైతులకు పూర్తి పరిహారం చెల్లించిన తరువాతే పవర్ గ్రిడ్ లైన్ వేస్తామని హామీ ఇచ్చారని... డబ్బులివ్వకుండానే పనులు చేస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పరిహారం ఇచ్చిన తరువాతే తమ భూముల్లోకి రావాలని డిమాండ్ చేశారు. దీంతో పవర్ గ్రిడ్ అధికారులు రైతులతో సంప్రదింపులు చేస్తున్నారు. నిరసన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి వీరులపాడు తరలించారు.