కృష్ణాజిల్లాలో మామిడి ప్రధాన ఉద్యన వన పంటగా 70 వేల ఎకరాలలో సాగులో వుంది. నూజివీడు పెరు చెబితే ఎవరికైనా గుర్తుకు వచ్చేది.. ఫల రాజం నూజివీడు మామిడి పండు. ఈ మధ్య కాలంలో నూజివీడు మామిడి మనుగడ ప్రశ్నార్థకం అయింది. తెలంగాణ నుంచి నాణ్యమైన మామిడి పండ్లు రావడంతో.. వాటి ముందు నూజివీడు మామిడి తీసికట్టుగా వుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూజివీడు ప్రాంతంలో మామిడి తోటలు 100 ఏళ్లుగా బాగా ముదురు తోటలు కావడంతో దిగుబడి తగ్గడం, వాతావరణ మార్పులు ప్రభావంతో పురుగులు, తెగుళ్లు బారిన పడటం, మంగు, ముడ్డి పుచ్చు లాంటి వాటితో రైతులు తీవ్రంగా నష్టపోవడం, కాయ పరిమాణం తగ్గిపోవడం లాంటి సమస్యలతో నూజివీడు మామిడికి నష్టం వాటిల్లింది.
ఈ పరిస్థితులలో మామిడి రైతులను ఆదుకునేందుకు ఉద్యానవన శాఖ అధికారులు మామిడి పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 30 నుంచి 40 సంవత్సరాలు వయసు గల ముదురు మామిడి తోటలను మొక్కతోటలుగా తయారు చేసుకోవడం ఎలా...? అలా తయారు చేసుకున్న మొక్క తోటలు రైతులకు అధిక దిగుబడులతోపాటు నాణ్యమైన పంటలను పండించుకోవచ్చా..? అన్న అంశాలపై ఉద్యానవన శాఖ అధికారులు గ్రామ గ్రామానా అవగాన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మొక్క తోటలుగా మార్చుకుంటే మళ్లీ 30 ఏళ్ల వరకు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు. మొక్క తోటలుగా మార్చిన 3 ఏళ్లలో మంచి కాపుకు వస్తాయని చెబుతున్నారు. ఈ కార్యక్రమంపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదీ చదవండి:దేశానికి సౌర వెలుగులు.. అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం