Farmers are Worried about Crop Damage Due to Michaung Cyclone:మిగ్‌జాం తుపాను వల్ల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. అష్టకష్టాలు పడి లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో వర్షాల కారణంగా నేలకొరిగాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
Krishna District:కృష్ణా జిల్లా దివిసీమలో లక్ష ఎకరాల్లో వరి పంట కోత దశకు చేరుకుంది. ఈ తరుణంలో వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్ పట్టలు పంపిణీ చేసిందని వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక్క పరదా కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. మెట్ట ప్రాంతంలో సుమారు 60 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న అరటి, బొప్పాయి, టమాట, మిర్చి ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు దిగుబడిపై వర్షాల ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ తుపాను నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు.
ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావం - విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు
NTR District:ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆరబెట్టిన ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు టార్పాలిన్ పట్టాల కోసం రైతులు హైరానా పడుతున్నారు. నియోజకవర్గంలో సుమారు 10 వేల ఎకరాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Dr BR Ambedkar Konaseema District:కోనసీమ జిల్లాలో కుండపోత వర్షాలకుపొలాలు నేలవాలుతున్నాయి. జిల్లాలో సుమారు లక్షా 52 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. దీంట్లో లక్ష ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయి. సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో ఉంది. ధాన్యం రాశులు తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. కుండపోత వర్షానికి ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని రైతులు మదనపడుతున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో వరిపైరు నీటమునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టినా ఫలితం దక్కడం లేదని ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తుపాను బీభత్సం - బిక్కుబిక్కుమంటున్న అన్నదాతలు