- కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన ఓ రైతు రెండు ఎకరాల్లో పసుపు పంట వేశారు. కృష్ణానది వరదలకు పూర్తిగా మునిగిపోయింది. దాదాపు వారం రోజులు పైగా నీటిలోనే ఉంది. ఇటీవల పంటనష్టం సర్వే అధికారులు వాటిని పరిశీలించకుండానే బాగానే ఉన్నట్లు నమోదు చేశారు. ఆ రైతుకు పరిహారం రాకుండా చేశారు.
- తిరువూరు మండలం జి.కొత్తూరుకు చెందిన రైతు పల్లెపాటి శ్రీనివాసరావు రెండున్నర ఎకరాల్లో వరి, ఏడు ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. పొట్ట దశలో ఉన్న సమయంలో దాదాపు పది రోజులు వర్షాలు కురిశాయి. దీంతో సుంకు మొత్తం రాలిపోయి.. వరి నేలమట్టమైంది. మిర్చి మొక్కలు చాలా వరకు నీరు నిలవడంతో గిడసబారి చనిపోయాయి. కానీ తన పంటను పరిహారానికి పరిగణనలోకి తీసుకోలేదని రైతు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో చాలామంది రైతుల పరిస్థితి ఇదే. వేలాది ఎకరాల్లో.. రూ.కోట్లాది పంటను రైతులు నష్టపోతే.. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సరిగా పరిశీలించకుండానే అంచనాలు రాస్తున్నారు. దీంతో అన్నదాతలు వారి చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది జిల్లాను వానలు, వరదలు ముంచెత్తి పత్తి, మినుము, మిర్చి, వరి లాంటి పంటలు, కూరగాయలకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం జిల్లాలో రెండు విడతలుగా పంటనష్టం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. జులై, ఆగస్టు, సెప్టెంబరు మూడు నెలల్లో కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టానికి ఒక విధంగా, అక్టోబరులో వాటిల్లిన నష్టానికి మరో విధంగా ఇచ్చేలా ప్రణాళిక వేస్తున్నారు.
*ఈ వ్యవసాయ సీజన్‌లో గత మూడు నెలల్లో (జులై నుంచి సెప్టెంబరు వరకు) కురిసిన వర్షాలకు రూ.7.60 కోట్లు పంట నష్టం కింద పరిహారం అందించనున్నారు. మొత్తం 10,003 మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 27 నుంచి ఈ సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
*అక్టోబరులో కురిసిన వర్షాలకు ప్రాథమికంగా అంచనా వేసిన పంటనష్టం రూ.15 కోట్లు. మొత్తం 20 వేల మంది రైతులకే ఇది అందనుంది. ప్రస్తుతం గ్రామాలకు సర్వే పేరుతో అధికారులు వెళుతున్నారు.
*నిబంధనల ప్రకారం పూర్తిగా నీటిలో మునిగిన పంట, నీటి మునిగి ఎండిపోయిన పంట మాత్రమే నమోదు చేస్తున్నారు. పాక్షికంగా నష్టపోయిన పంటను పరిగణనలోకి తీసుకోవడం లేదు.
*నదీ పరివాహకప్రాంతాలు, వాగులు, వంకలతో మునిగిన ప్రాంతాల్లో మాత్రమే నమోదు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన పంట లెక్క వేయడం లేదు.