భవిష్యత్తుపై భరోసా కోల్పోయిన ఓ పేద రైతు గుండె ఆగిన ఘటన రాజధాని గ్రామాల్లో కలకలం రేపుతోంది. అమరావతిలోని వెంకటపాలెంకు చెందిన రైతుకూలీ వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. రోజూ మందడంలో జరిగే రైతుల ఉద్యమంలో పాల్గొంటున్న ఆయన.. బాత్‌రూమ్‌కు వెళ్లి అక్కడే కుప్పకూలారు. భార్య, ఇద్దరు కుమారులతో ఒకప్పుడు కౌలు వ్యవసాయం చేసుకొంటూ సంతోషంగా బతికిన వెంకటేశ్వర రావుకు రాజధాని రాకతో చేసేందుకు పొలం దొరకని పరిస్థితి ఏర్పడింది. నాటి నుంచీ కూలీగానే జీవిస్తూ ఇద్దరు పిల్లలనూ చదివిస్తున్న ఆయన... తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మరింత ఆవేదనకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. 2 రోజుల కిందటే మీకిక చదువే దిక్కంటూ ఫోన్‌లో హితబోధ చేశారని చెబుతూ కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
20వరోజు తుళ్లూరు నుంచి మందడం వరకు ర్యాలీలు
మరోవైపు రాజధాని రైతుల పోరు రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. సకల జనుల సమ్మె, రాజధాని బంద్‌తో ఇప్పటికే ఉద్యమం ఊపందుకోగా.... రేపు జాతీయ రహదారి దిగ్భందనానికి రైతులు సిద్ధమవుతున్నారు. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, 29 గ్రామాల ప్రజలు ఐక్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రైతులు ధర్నాలకే పరిమితం కాకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ అందరినీ ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తున్నారు. 20వ రోజైన ఇవాళ వివిధ గ్రామాల ప్రజలు తుళ్లూరు నుంచి మందడం వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయుని పాలెంలో పూజలు చేయనున్నారు. వెంకటపాలెంలో మృతి చెందిన వెంకటేశ్వర రావు భౌతిక కాయానికి అమరావతి పరిరక్షణ సమితి నివాళులు అర్పించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
అన్ని ప్రాంతాల నుంచి రైతులుకు మద్దతు
రైతుల ఆందోళనలకు అన్ని ప్రాంతాల నుంచీ మద్దతు లభిస్తోంది. అఖిల పక్షాలు సహా ఇతర జిల్లాలకు చెందిన ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి బాసటగా నిలుస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారి ప్రాంతాల్లో పండిన పంటలను రైతులకు విరాళంగా ఇస్తుంటే మరికొందరు తోచిన మేరకు ఆర్థిక సాయం చేస్తున్నారు.