సైబర్ నేరస్తులు పోలీసులకు సవాల్ గా మారుతున్నారు. పోలీసుల పేర్లు, ఫొటోలతో నకిలీ ఖాతాలను తెరచి నయా మోసానికి తెర తీస్తున్నారు. తాజాగా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచారు. అత్యవసరంగా తనకు 10 వేల రూపాయలు కావాలని అకౌంట్ కు నగదు పంపాలని స్నేహితులకు మెస్సేజ్ పంపారు . స్నేహితులు ఇన్స్ పెక్టర్ కు ఫోన్ చేసి అడగటంతో సైబర్ నేరస్తుల నకిలీ ఖాతాల గుట్టు బయటపడింది . తన పేరుపై ఉన్న ఫేస్ బుక్ ఖాతా నకిలీదని ఎవ్వరూ నగదు పంపవద్దని సీఐ చంద్రశేఖర్ తెలిపారు . ఈ తరహాలోనే విజయవాడ కమిషనరేట్ పరిధిలో నెలరోజుల్లో 20 ఫిర్యాదులు వచ్చాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెపుతున్నారు . అత్యవసరంగా నగదు కావాలని ఫేస్ బుక్ లో పోలీసు అధికారుల పేర్లతో ఎవరైనా మెస్సేజ్ పంపితే .. సంబంధిత అధికారికి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు .
ఇదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్, ఇతర అధికారుల పేర్లతో నకిలీఖాతాలు సృష్టించినట్లు వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని నల్గొండ ఎస్పీ ఏవి రంగనాథ్ పేరుతో నకిలీ ఖాతాను సృష్టిస్తే కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సైబర్ కేసుల్లో నిందితులను పట్టుకోవటం పోలీసులకు ప్రహసనంగా మారుతుంది . దీంతో నేరస్తులు రెచ్చిపోతున్నారు.