ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని ఎందుకు కొనిపించలేకపోతుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశ్నించారు. పసుపు చైతన్యంలో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి.. కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడులో దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. 75 కిలోల ధాన్యం బస్తాకు రూ. 472లు దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు.
పంట బీమా కట్టకుండా ప్రభుత్వం మొద్దునిద్రపోయి.. రైతులను గాలికొదిలేసిందని సౌమ్య విమర్శించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత లేకుంటే.. రైతు బతికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్లో తెదేపా సవరణలు సూచిస్తే.. వైకాపా మాత్రం మద్దతు ప్రకటించిందన్నారు. రైతుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరేమిటో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.