రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరో హరిత విప్లవం రానుందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. రైతు ద్రోహిగా మిగలొద్దని ముఖ్యమంత్రి జగన్‌కు హితవు పలికారు. నివర్ తుపాను పోయి 2 వారాలు దాటుతున్నా ఇంతవరకూ పంట నష్టం అంచనా వేయలేదని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా మొలకలొచ్చిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చేసిన ప్రకటనలు అమలు కావట్లేదన్నారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు.
ఈ-క్రాప్ నమోదు కాకపోయినా, అడంగల్‌లో పేరు లేకపోయినా నష్టం అంచనాను నమోదు చేయట్లేదని ఆక్షేపించారు. ఏ కౌలు రైతుకు న్యాయం చేయలేదని, రైతులు దోపిడీకి గురవుతూ నిస్సహాయ సిత్థిలో ఉండటానికి ప్రభుత్వ అసమర్ధతే కారణమన్నారు. నివర్ తుపాను నష్టంపై ముఖ్యమంత్రి, మంత్రి ఒక్క సమీక్షా నిర్వహించలేదని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు రంగుల కేంద్రాలుగా మారాయన్నారు. ఏ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదని.. వ్యవసాయాన్ని బతికించే చర్యలు ప్రభుత్వం ఎక్కడా చేపట్టలేదని విమర్శించారు. పంటల బీమా కట్టకుండా కట్టామని అసత్యాలు చెప్పారని.. అన్నదాతల ఆత్మహత్యలు లేని రోజు రాష్ట్రంలో ఒక్కటీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు, వ్యవహారం వల్ల రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా లేదని ఆలపాటి రాజేంద్రప్రసాద్ దుయ్యబట్టారు.