ఈటీవీ భారత్ : కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. 20లక్షల కోట్లు ఇస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించినప్పుడు మంచి స్పందన వచ్చింది. నిర్మలా సీతారామన్ ఐదు రోజులు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆ ఉత్సాహం నీరుగారిపోయింది. ఐటీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా దీనిపై మీ స్పందన ఏంటి..?
బీవీఆర్:ఉద్దీపన ప్యాకేజీ జీడీపీలో 10శాతం ఉంటుందని చెప్పారు.. కానీ నగదు రూపంలో జరిగిన లబ్ది తక్కువ. రాష్ట్రాలకు, వివిధ రంగాలకు అందిన మొత్తాన్ని లెక్కిస్తే 1.5శాతం నుంచి 1.7శాతం వరకూ ఉండొచ్చని లెక్కవేశారు. దాంతో పరిశ్రమ నిరుత్సాహపడింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో పారిశ్రామికరంగం దెబ్బతింది. కానీ ఆ దేశాల్లో పరిశ్రమలను నేరుగా ఆదుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనాల్లో ప్యాకేజీ బాగుంది. అక్కడ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో మూడు నెలల ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వాలే భర్తీ చేశాయి. మన దగ్గర నేరుగా లబ్ది చేకూరకపోవడంతో పరిశ్రమవర్గాలు నిరుత్సాహపడ్డాయి
ఈటీవీ భారత్ :జీడీపీలో దాదాపు 8 శాతం భాగస్వామ్యం, 15లక్షల కోట్ల టర్నోవర్, దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యవస్థ, అత్యధికంగా విదేశీ నిధులు రాబడుతున్న పరిశ్రమ.. ఇన్ని ప్రాధాన్యతలున్నా.. ఎకనామిక్ ప్యాకేజ్ లో ఐటీ పరిశ్రమకు సరైన ప్రోత్సాహం ఇవ్వలేదు.. దీనిపై మీరేమంటారు..?
బీవీఆర్: ప్యాకేజీలో ఏ పరిశ్రమపైనా దృష్టి పెట్టలేదు. ఎమ్.ఎస్.ఎమ్.ఈలకు మాత్రమే ప్రోత్సాహాన్ని ప్రకటించారు. ఐటీ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తప్పకుండా చేసి ఉండాల్సింది. ఐటీ పరిశ్రమకు వచ్చే ఆదాయంలో 70శాతం ఎగుమతుల ద్వారానే వస్తుంది. ఐటీ విషయంలో డిమాండ్, సప్లయ్ రెండూ దెబ్బతిన్నాయి. డిమాండ్ ఉన్న దేశాల్లో కరోనా విజృంభించింది. సేవల సప్లయ్ విషయంలోనూ సమస్యలున్నాయి. కాబట్టి ఐటీ పరిశ్రమకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది.
ఈటీవీ భారత్ :లాక్ డౌన్ పరిస్థితుల్లో ఐటీ పరిశ్రమ... ప్రభుత్వం నుంచి ఏం ఆశించింది..?
బీవీఆర్:సులభతర వాణిజ్యం మెరుగవ్వాలని కోరాం. అలాగే కార్మిక చట్టాలను కొంచెం సడలించాలి. పన్నులకు సంబంధించిన సమస్య ఉంది. మాకు సేవా పన్ను ఉంటుంది. ఇవన్నీ ఎగుమతులు కాబట్టి.. సేవాపన్నును మేము ప్రభుత్వం వద్ద క్లెయిమ్ చేసుకోవాలి. ఆ మొత్తం రావడానికి సమయం పడుతోంది. ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించి కొన్ని సమస్యలున్నాయి. దీనికి డైనమిక్ ఐపీలు అవసరం అవుతాయి. వీటిని జూలై 31వరకూ అనుమతిచ్చారు. వీటిని వచ్చే ఏడాది మార్చి వరకూ ఇవ్వమని చెబుతున్నాం.
ఈటీవీ భారత్ :ఐటీ పరిశ్రమ వినతులను ప్రభుత్వం ఏమైనా పట్టించుకుందా.. ?
బీవీఆర్:కొన్నింటిని పట్టించుకున్నారు. ఓఎస్పీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించాలంటే.. కోటి రూపాయలకు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉండేది. దానిని తీసేశారు. చిన్న ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లలో మూడు నెలలు ఆదాయం లేకపోతే వాళ్లు వేతనాలు ఎలా చెల్లించగలరు..!? ఇక్కడ ఎంతమందికి వేతనాలు చెల్లించాలనే దానిపై నిబంధనలున్నాయి. ఆ తర్వాత వాటిని కాస్త సడలించారు. కానీ ముఖ్యమైన విషయాలను వదిలేసి చిన్న చిన్న విషయాలను పరిష్కరించారు. కానీ చిన్న ఐటీ కంపెనీల్లో మూడు నెలల వేతనాలకు భరోసా ఇచ్చి ఉంటే.. మంచి వెసులుబాటు దక్కేది.
ఈటీవీ భారత్ : కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నిజంగా గట్టెక్కించలుగుతుందా..?
బీవీఆర్:చాలా కష్టం. కానీ ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. భారత్ వంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో అమెరికాలో మాదిరిగా రెండు, మూడు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీలు ఇక్కడ ఇవ్వలేరు. ఇలా ఖర్చు చేస్తే.. భారీ ఆర్థికలోటు ఏర్పడుతుంది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. కాబట్టి కొన్ని సవాళ్లు తప్పవు.
ఈటీవీ భారత్ :చాలా మంది.. ఆర్థిక వేత్తలు, రాజకీయ వేత్తలు ఈ ఎకనామిక్ ప్యాకేజీని ఒక భ్రమ అని కొట్టిపడేస్తున్నారు..ఇంత డబ్బు ప్రకటించారు కానీ.. అదంతా ప్రజలకు, పరిశ్రమకు చేరదు అంటున్నారు. ఎంత వరకూ నిజం?
బీవీఆర్:తప్పకుండా ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలి. స్తంభించిపోయిన ఆర్థికవ్యవస్థను కదిలించాలి. డిమాండ్ వైపు కదిలించగలగాలి. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే అది జరుగుద్ది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌లో కొంత ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఆ డబ్బు మార్కెట్లోకి తీసుకురావాలన్నది ప్రయత్నం. కానీ.. పీఎఫ్ అనేది పొదుపు. ఆ డబ్బును ఖర్చుచేయడం సమంజసం కాదు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ నగదు దాచుకోవాలనే ప్రయత్నిస్తారు. ఎవరూ ఖర్చు చేయరు. దీనికి బదులుగా ప్రజలకు నేరుగా నగదు అందిస్తే బాగుండేది.
ఈటీవీ భారత్ :ఆధునిక చరిత్రలోనే ఈస్థాయిలో నష్టం ఇంతకు ముందు జరగలేదు. భారత దృష్టికోణంలో ఆర్థికంగా కానీ... సామాజికంగా కానీ మనం ఏ స్థాయిలో దెబ్బతిన్నాం..?
బీవీఆర్: చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వలస కార్మికులు దారుణమైన వివక్షకు, అవమానానికి గురయ్యారు. వారి విషయంలో అంతకన్నా తక్కువ పదాన్ని వాడలేం. అది చాలా బాధాకరం. పరిశ్రమలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఆతిథ్య రంగం, పర్యాటకరంగం పూర్తిగా దెబ్బతిన్నాయి. వైద్యరంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంది. అమెరికాలోనే పదిశాతం మంది వైద్యులు ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని పరిశ్రమలు పురోగమించాయి. ఈ కామర్స్ వృద్ధి చెందింది. విద్యారంగంలో ఈ లెర్నింగ్ వస్తోంది. సాంకేతిక పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. 5జీ సాంకేతికత వస్తే.. విదేశీ వైద్యుల సూచనలతో నేరుగా ఆపరేషన్లు చేయొచ్చు. 1932లో వచ్చిన తీవ్ర ఆర్థిక మాంద్యం తర్వాత ఆటోమొబైల్, విద్యుత్ ఆధారిత పరిశ్రమల్లో వృద్ధి వచ్చింది. ఇప్పుడు కూడా 2020 తర్వాత సాంకేతికతపై ఆధారపడే పరిశ్రమల్లో వృద్ధి ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది.