CPS Scheme: రాష్ట్రానికి సంబంధించిన అప్పుల వ్యవహారంలో తాజాగా సంభవించిన ఒక పరిణామాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా కొండెక్కించినట్లేనా అన్న అనుమానాలు రేగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) పథకం కోసం ప్రభుత్వం, ఉద్యోగుల తరపున వాటా సొమ్ములను చూపించి ఆ మేరకు బహిరంగ మార్కెట్‌లో కొత్త రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అనుమతి పొందింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశానా లేదని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతవరకు ఎన్నడూ లేనిది
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఏ మార్గంలో దొరికితే అక్కడ అప్పులు చేస్తోంది. ప్రతి ఏటా జీఎస్‌డీపీలో 3.5 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకునేందుకు ఆర్థిక సంఘం అనుమతించింది. ఇందుకు ఇతరత్రా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఆర్థికశాఖ అనుమతులు ఇస్తూ ఉంటుంది. ఈ మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ అర్హత రుణ పరిమితి రూ.44,574 కోట్లుగా తేలింది. తాజాగా మరో రూ.4,203.96 కోట్ల రుణం తీసుకునేందుకు సీపీఎస్ నిధుల వాటా ఆధారంగా అనుమతులు ఇచ్చామని కేంద్రం వెల్లడించింది. ఇది పూర్తిగా కొత్త పరిణామం. ఇంతవరకు ఎన్నడూ లేనిది. ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కింద మొత్తం 1,92,000 మంది ఉద్యోగులున్నారు. ఈ స్కీం కింద వారికి పదవీ విరమణ తర్వాత ఏక మొత్తం నిధి ఇచ్చేందుకు వీలుగా ఉద్యోగుల నుంచి మూలవేతనంలో 10 శాతం ప్రభుత్వం వసూలు చేస్తుంది. అంతే సమానమైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమూ చెల్లిస్తోంది. రెండింటినీ కలిపి సంబంధిత అథారిటీకి జమ చేస్తోంది.