చేయూత పథకం కింద 45-60 ఏళ్ల మధ్య ఉన్న SC, ST, BC, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున నాలుగేళ్లకు 75 వేలు ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే రెండు విడతల సాయాన్ని అందించగా...... వచ్చే నెల 22వ తేదీన మూడో విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. గతేడాది రెండో విడత కింద 23.14 లక్షల మందికి ఆర్థిక సాయాన్ని అందించారు. మూడో విడత సాయాన్ని అందించేందుకు 10 దశల తనిఖీ ప్రక్రియ ఆధారంగా గతేడాది లబ్ధిదారులను ప్రభుత్వం తనిఖీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా రెండు జాబితాలు రూపొందించి క్షేత్రస్థాయికి పంపింది. తాత్కాలిక అర్హుల జాబితా, పునఃపరిశీలన జాబితాను సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శులకు పంపింది.
300 యూనిట్ల వినియోగ నిబంధనతోపాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపుదారుడు, వ్యవసాయ భూమి, నాలుగు చక్రాల వాహనం, పట్టణాల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే పెద్ద ఇల్లు ఉండటం తదితర కారణాలతో చాలా మంది పునఃపరిశీలన జాబితాలో చేరారు.YSR జిల్లాలోని ఓ మండల పరిధిలో 20 మంది గతేడాది చేయూత లబ్ధిదారులు పునఃపరిశీలన జాబితాలో ఉంటే అందులో 10 మంది 300 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించిన వారే ఉన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలోని ఓ సచివాలయంలోఆరుగురిని పునఃపరిశీలన జాబితాలో చేర్చితే అందులో ముగ్గురిది అదనపు విద్యుత్తు వాడకమే కారణం. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలోని ఒక సచివాలయంలో పునఃపరిశీలన జాబితాలోని ఏడుగురిలో నలుగురిది ఇదే సమస్య. కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని ఓ సచివాలయ పునఃపరిశీలన జాబితాలో 15 మంది ఉంటే ఆరుగురు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల్లో పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు.