ED raids in MP Magunta Srinivasulureddy House: దిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, దిల్లీలోని 40 చోట్ల సోదాలు నిర్వహించింది. మద్యం వ్యాపారులు, పంపిణీదారులు, సరఫరా వ్యవస్థలకు సంబంధించిన ప్రదేశాల్లో తనిఖీలు చేసింది. వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన దిల్లీ, చెన్నై, నెల్లూరుల్లోని నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లాకు ప్రత్యేక బృందాలుగా వచ్చిన ఈడీ అధికారులు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు రాయాజీ వీధిలోని మాగుంట కార్యాలయానికి చేరుకున్న ఈడీ అధికారులు.. దస్త్రాలను పరిశీలించి, కార్యాలయ సిబ్బందిని విచారించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మరో బృందం వచ్చి.. సర్వేపల్లి, సింగరాయకొండలోని లిక్కర్ కంపెనీల దస్త్రాలను తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. బీరువాలు, లాకర్లకు తాళాలు వేసి ఉండటంతో వాటిని పగలగొట్టేందుకు బయట నుంచి వ్యక్తిని తీసుకెళ్లారు.
బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలో ఉంటున్న మాగుంట బంధువు ఏటూరు శివరామకృష్ణారెడ్డి ఇంట్లో మరో బృందం సోదాలు నిర్వహించింది. ఇంట్లోని వారిని ప్రశ్నించింది. హైదరాబాద్‌లో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన ట్రైడెంట్ చిమర్ లిమిటెడ్ సంస్థలోనూ తనిఖీలు జరిగాయి. మాగుంటకే చెందినవని భావిస్తున్న చెన్నైలోని ఏంజెల్స్ షాంపైన్ ఎల్‌ఎల్‌పీ, తమిళనాడు ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోనూ ఈడీ సోదాలు జరిగాయని తెలిసింది.