ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ బోరబండలోని ప్రాంతాలు భూప్రకంపనలతో ఆందోళనకరంగా మారాయి. గత రాత్రి 8.35 గంటలకు భూమి 15 సెకన్ల పాటు కంపించడంతో ఒక్కసారిగా ఇళ్లనుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 1.5గా నమోదు అయినట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్ తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురికావడం వల్ల అక్కడికి చేరుకున్న ఎస్ఆర్నగర్, జూబ్లీహిల్స్ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గంటలపాటు ప్రజలు రోడ్లపై ఉండటంతో వారికి నచ్చజెప్పి ఇళ్లలోకి పంపిచారు.
భారీ శబ్ధంతో ప్రకంపనలు
డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ అక్కడకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రజలు ఎవరూ భయపడవద్దని తెలిపారు. భూకంపంపై సామాజిక మాద్యమాల్లో కొందరు వదంతులు ప్రచారం చేస్తున్నారని... ఇది ఎలాంటి ప్రమాదకరం కాదని ప్రజలకు నచ్చజెప్పారు. స్థానిక దేవాలయాలు, మసీదుల మైకుల్లో ప్రజలకు ఇళ్లలోపలికి వెళ్లాలని సూచించారు. ప్రజలంతా భయం నుంచి తేరుకుని ఇళ్లలోకి వెళ్లగానే సరిగ్గా 11.25గంటల ప్రాంతంలో మరోసారి భారీ శబ్ధంతో ప్రకంపనలు వచ్చాయి.