ఎంసెట్ ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రకియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని విధ్యార్థులు ఏ కళాశాలను ఎంచుకోవాలి.. ఏ బ్రాంచి తీసుకోవాలి.. మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు ఉన్నారా? లేదా? వంటి ప్రశ్నలకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు.
గతేడాది ఏ బ్రాంచిలకు ప్రాధాన్యమంటే...
* టాపర్స్ సీఎస్‌ఈకి ప్రాధాన్యం ఇస్తుండగా తర్వాత స్థానాల్లో ఐటీ, ఈసీఈ, ఈఈఈ ఉన్నాయి.
* ఎవర్ గ్రీన్‌గా మెకానికల్ ఉంది.
* సివిల్ విభాగానికి ఆదరణ పెరిగింది.
* ఏరోస్పేస్, అగ్రికల్చరల్, మెరైన్, మైనింగ్, సిల్క్ అండ్ టెక్స్‌టైల్ వంటి నైపుణ్యంతో కూడిన బ్రాంచ్‌లకు మంచి అవకాశాలున్నాయి.
రెండేళ్ల సరళి...
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అక్టోబర్, నవంబరులో అమెజాన్, ఇన్ఫోసిస్, గూగుల్, డెల్లాయిట్, టీసీఎస్, విప్రో, సీటీఎస్ వంటి బహుళజాతి సంస్థలు ప్రాంగణ ఎంపికలు ప్రారంభించాయి. వార్షిక వేతనం రూ.19 నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చాయి. గతం కంటే అత్యధిక వేతనాలతో అవకాశాలు పొందుతున్నారు. ఏటా మొత్తం విద్యార్థుల్లో 15 నుంచి 20 శాతం మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు.
* రెండు జిల్లాల్లో 2018-19 విద్యా ఏడాదికి 100 బహుళ జాతి సంస్థలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించి 8 వేల మందికి ఉపాధి కల్పించాయి. 2019-20 విద్యా ఏడాదికి 120కు పైగా సంస్థలు అమరావతి పరిధిలోని 10 వేల మందికి పైగా విద్యార్థులకు ఏడాదికి కనిష్ఠంగా రూ.3.6 లక్షలు, గరిష్ఠంగా రూ.12 లక్షలతో ఉద్యోగాలు ఇచ్చాయి.
చేయండిలా...
* తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో విద్యార్థుల దాన్నే ఎంచుకోవాలి. క్రేజ్ బ్రాంచ్‌లను ఎంచుకొని, వాటిపై ఆసక్తిలేక, పూర్తి చేయలేక విద్యా ఏడాది వృథా చేసుకోకూడదు. ఎవరో స్నేహితుడు తీసుకున్నాడని అదే బ్రాంచి ఎంచుకుంటే ఇబ్బందులు తప్పవు.
* కళాశాలలో మౌలిక సదుపాయాలు చూడాలి. నాక్, అటానమస్, ఎన్‌బీఏ, తదితర గుర్తింపులు ఉన్నయో లేదో పరిశీలించాలి. అధ్యాపక బృందం వివరాలు తెలుసుకోవాలి. వెబ్‌సైట్ ద్వారా కళాశాల ఉత్తీర్ణత, ప్రాంగణ ఎంపికల సమాచారం తెలుసుకోవాలి.
* ఏ బ్రాంచిలో ఇంజినీరింగ్ చేసినా సాఫ్ట్‌వేర్ కొలువు వస్తుంది. కనుక ప్రాంగణ ఎంపికలకు కావాల్సిన నైపుణ్య శిక్షణను తొలి ఏడాది నుంచి ఇచ్చే కళాశాలను గుర్తించాలి. పుస్తకాలకే పరిమితం కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రయోగాత్మక బోధనలకు ప్రాధాన్యమిచ్చే కళాశాలల వైపు దృష్టి సారించాలి.
* ఇంజినీరింగ్ తర్వాత ఉద్యోగం చేయాలా..పరిశ్రమలు స్థాపించాలా.. లేక ప్రభుత్వ ఉద్యోగమా అనే లక్ష్యాన్ని ఇప్పటినుంచే ఏర్పరచుకోవాలి.
* భావవ్యక్తీకరణ, ఆంగ్లంపై నైపుణ్యం పెంచుకోవాలి.
సీఎస్‌ఈ, ఐటీ: స్వీయ సముపార్జన
- అన్నే కోటేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్
కంప్యూటర్స్ సైన్స్ విద్యార్థులు మొదటి ఏడాదిలో సీ ప్రోగ్రామింగ్, కోడింగ్‌పై పట్టు సాధించాలి. రెండో ఏడాది నుంచి డేటాస్ట్రక్చర్స్, నాలుగో ఏడాది మంచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకోవాలి. డిజైన్ అలగారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పరిజ్ఞానం కీలకం.
ఈసీఈ: ఫిజిక్స్‌పై పట్టు తప్పనిసరి
- రామకృష్ణ, ప్రిన్సిపల్, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల
ఈసీఈ చదవాలంటే ఫిజిక్స్ బేసిక్స్‌పై పట్టు తప్పనిసరి. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ రూపకల్పన తయారీలో అవకాశాలు బాగున్నాయి. మూడో సంవత్సరంలో వీఎల్‌ఎస్‌ఐ, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్, మైక్రోవేవ్, రాడార్, సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది.