నేను, నా కుటుంబం అనే భావనను విడనాడి ప్రపంచమంతా మన కుటుంబమనే ఆలోచనను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. పూణేలోని మిట్ ప్రపంచ శాంతి విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 6వ ప్రపంచ శాంతి, మతం, తత్వశాస్త్ర పార్లమెంటు ముగింపు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ప్రపంచంలో అతిపెద్దది..
ప్రపంచంలోనే అతిపెద్ద గోపురంగా భావిస్తున్న పూణేలోని కల్బోర్ వద్ద ఉన్న సెయింట్ ధ్యానేశ్వర ప్రపంచశాంతి గోపురంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ప్రపంచ శాంతి, మతం, తత్వశాస్త్ర పార్లమెంట్ ఆదివారంతో ముగిసింది.
వసుదైక కుటుంబం..
వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని భారత్ అనుసరిస్తోందని.. అందుకే భిన్నమతాలు, సంస్కృతులు, భాషలు ఉన్నాయని గవర్నర్ వివరించారు. శాంతి సామరస్యాలతో మునుగడ సాగించినప్పుడే విశ్వశాంతి సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. గాంధీజీ 151వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు.
బాపూజీ మార్గదర్శక శక్తి..
మహాత్మాగాంధీ యావత్ దేశానికే మార్గదర్శక శక్తి అని గవర్నర్ కొనియాడారు. బాపూజీ బోధనల నుంచి నేటి యువత ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన సూచించారు. ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్న కరోనా మహమ్మారిపై ప్రపంచ వ్యాప్తంగా ఐక్యంగా ముందడుగు వేసినప్పుడే విజయం సాధించగలమని హరిచందన్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు: కొల్లు రవీంద్ర