E-Waste Collection Program in Vijayawada: విజయవాడలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ- వ్యర్థాల సేకరణ పేరుతో కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి నిర్వహించిన ఈ ప్రదర్శనలో జిల్లా కలెక్టరు ఎస్.ఢిల్లీరావు పాల్గొన్నారు. నిత్యం కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తుండడంతో వినియోగించిన.. పాత ఎలక్ట్రానిక్ సామగ్రిని వృథాగా పారేస్తున్నారు. ఈ వ్యర్థాలు యావత్తు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయని.. నామమాత్రంగా రీసైక్లింగ్ జరుగుతుండడంతో పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై చట్టాలు చేసినప్పటికీ వాటి అమలుకు చర్యలు తీసుకోవడం లేదని.. పైగా ఈ- వ్యర్థాలు భూమిలో కలిసిపోయేవి కాకపోవడంతో విషపూరితంగా మారి గాలిలో, భూమిలో, నీటిలో కలుస్తూ ప్రాణకోటిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఆవేదన చెందారు. సరైన విధానంలో వీటిని ధ్వంసం చేయకపోవడం, అవగాహన లేక తగలబెట్టడం వల్ల వాటి నుంచి విషవాయువులు వాతావరణంలో కలుస్తున్నాయని.. ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు ఉన్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయన్నారు. చైనా, అమెరికా, భారత్ ఈ-వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపారు.
భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజాన్ని అందించేందుకు, పర్యావరణ సమతుల్యత కోసం లయన్స్ క్లబ్ ఈ-వేస్ట్ సేకరణను ఉద్యమంగా చేపడుతోందని అన్నారు. 105 క్లబ్‌ల ద్వారా నెల రోజులలో వెయ్యి టన్నుల ఈ- వ్యర్థాల సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు కృష్ణా జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ శ్రీశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కోరారు.