కృష్ణా జిల్లా తెలంగాణ రాష్ట్రం సరిహద్దుగా సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి. పశ్చిమ కృష్ణా వాసులకు విజయవాడ కంటే ఎక్కువగా ఖమ్మంతో అనుబంధం ఎక్కువగా ఉంది. సరిహద్దులో ఉన్న కోదాడ, ఖమ్మం, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి పట్టణాలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. వ్యవసాయపరంగా రాకపోకలు సాగుతుంటాయి. ప్రధానంగా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల వారు ఎక్కువగా ఖమ్మం, మధిరతో సంబంధాలు కలిగి ఉంటారు. విజయవాడ రావడానికి కనీసం 90 కి.మీ. ప్రయాణం చేయాలి. ఖమ్మం కేవలం 30 కి.మీ లోపు ఉంటుంది. దీంతో వైద్య అవసరాలు, వ్యాపార అవసరాలు, మార్కెట్ అవసరాలకు ఖమ్మం ప్రయాణం చేస్తారు. కంచికచర్ల, గంపలగూడెం, రెడ్డిగూడెం, తిరువూరు మండలాల వాసులు అటువైపే ప్రయాణం సాగిస్తారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ సరిహద్దు వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. ఏపీ వైపు అభ్యంతరాలు చెప్పకపోయినా తెలంగాణ తనిఖీ కేంద్రాల వద్ద అభ్యంతరం చెబుతున్నారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉంది. కానీ ఆ సమయంలోనూ అనుమతి లేదని సోమవారం నుంచి నిలిపివేశారు. ఈ పాస్ తప్పనిసరి చేశారు.
* వత్సవాయి మండలానికి చెందిన గ్రామాల ప్రజలు ఏ చిన్న అవసరం అయినా పక్కనే 10 కిలోమీటర్లు దూరం ఉన్న బోనకల్లు వెళతారు. పాలు, కూరగాయలు తీసుకెళ్లి విక్రయించుకుంటారు. అలాంటివాటిని నిలిపివేశారు. దీంతో చాలా మందికి ఉపాధి కరవైంది. బోనకల్లు మండలం నుంచి వత్సవాయి, పెనుగంచిప్రోలుకు మామిడికాయలు కోసేందుకు వస్తారు. ప్రస్తుతం కూలీలను తీసుకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చెట్లమీద పండిపోతున్నాయి. గాలి దుమారానికి కింద పడిపోతున్నాయి.
* పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేట మండలాల నుంచి ఎక్కువగా మధిర పట్టణానికి వెళతారు. ఆరోగ్య సమస్యలకు మధిరలో ఓ మోస్తరు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. వీటికి అడ్డు చెప్పకూడదన్న నిబంధన ఉన్నా అంతరాష్ట్ర ప్రవేశం లేదని తెలంగాణ పోలీసులు నిరాకరిస్తున్నారు.
* తిరువూరు ప్రాంతంలో పెనుబల్లి మండలంలోనూ తెలంగాణ తనిఖీ కేంద్రం వద్ద రాకపోకలు నిలిపివేస్తున్నారు. వీఎం బంజర, పెనుబల్లి గ్రామాల నుంచి ప్రజలు తిరువూరు వస్తుంటారు. మామిడి కోతలు, ఇతర పనులకు బ్యాంకు పనులకు వస్తుంటారు. ప్రస్తుతం వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పక్కనే ఉన్న గ్రామీణ లింకు రహదారులను వినియోగిస్తున్నారు.
* భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం నుంచి విజయవాడలోని ఆసుపత్రులకు ఎక్కువగా వస్తుంటారు. విజయవాడ గొల్లపూడి మార్కెట్‌కు, కూరగాయల మార్కెట్‌కు, పూల మార్కెట్‌కు ఈ ప్రాంతం నుంచి వ్యాపారులు వస్తుంటారు. ప్రస్తుతం ఇవి నిలిచిపోయాయి. మొదట తెలంగాణలో 4 గంటల సడలింపు, ఆంధ్రలో 6 గంటల సడలింపు ఉండడంతో తెల్లవారుజామున వచ్చి మార్కెట్ నుంచి సరకులు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం ఆ సమయాల్లోనూ తెలంగాణలో వాహనాలను అనుమతించడం లేదు. ఈ పాస్ ఉంటేనే రావాలని తిప్పి పంపుతున్నారు. తెలంగాణలోకి ప్రవేశం కూడా నిషేధించారు. బస్సులు లేక, వాహనాలకు అనుమతించక ఆ ప్రాంత వాసులు రావడం లేదు.