MLC Polling : అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఓటు గల్లంతైంది. ఆయనతో పాటు విప్ కుటుంబ సభ్యుల 12 ఓట్లు లేవు. దీంతో విప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఓట్లు గల్లంతైన విషయమై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని విప్ డిమాండ్ చేశారు.
ఎస్ఎస్ సి చదివి... తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద పదవ తరగతి చదివిన మహిళ గ్రాడ్యుయేట్ ఓటు వేసేందుకు వచ్చారు. అక్కడ ఉన్న మీడియా సిబ్బంది... ఏం చదివారు..? అని ప్రశ్నించగా పదో తరగతి చదివాను..` అని సమాధానం ఇచ్చింది. డిగ్రీ లేకుండా ఓటు ఎందుకు వేస్తున్నారు అని ప్రశ్నించగా మౌనమే సమాధానమైంది.
బీజేపీ ఆందోళన... వైఎస్సార్సీపీ నాయకులు దొంగ ఓట్లు వేసుకుంటున్నారని పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతపురంలో కేఎస్ఆర్ పోలింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ నాయకులకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సాయిలీలా అనే ఉపాధ్యాయురాలు.. ఓటు ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. ఎలక్షన్ పరిశీలకులను అడిగినా సమాధానం చెప్పడం లేదన్నారు. అధికారులే దొంగ ఓట్లు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన ఓట్లు గల్లంతు అయ్యాయని.. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫొటో... బేలుగుప్ప మండలంలోనూ దొంగ ఓట్ల వ్యవహారంపై టీడీపీ ఏజెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ యువతికి ఓటు స్లిప్పుతో పాటు వెఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఫొటో ఉండే స్లిప్పును ఇచ్చి పంపారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెట్ దీనిని గమనించి నిలదీశారు. పోలింగ్ కేంద్రం అధికారులు ఓటర్లను తనిఖీలు చేయకుండా కేంద్రంలోకి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారి బయట వ్యక్తులు ఆ స్లిప్పు ఇచ్చారని, తమకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. యువతి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫొటో ఉన్న స్లిప్పును తీసుకొని పడేశారు. అధికారులే వైఎస్సార్సీపీ నాయకులకు సహకరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.
ఓటు వేసిన జేసీ... అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సామాన్యుడి లాగా క్యూలైన్లో నిల్చుకొని ఓటు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్ చాలా పెద్దగా ఉందని.. ఓటు వేయడానికి వచ్చినవారు కన్ఫ్యూజ్ కు లోనవుతున్నారన్నారు. పోలింగ్ కేంద్రాల ముందు నమూనా పెట్టి బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టభద్రులు, టీచర్లు ప్రలోభాలకు లోనవ్వడం చూస్తుంటే దేశం బాగుపడే అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు చక్కగా ఆలోచించి మంచి నాయకున్ని ఎన్నుకుంటే బాగుంటుందన్నారు. ఒక ఉపాధ్యాయుడు ఓటుకు అమ్ముడపోనని ఫ్లెక్సీ వేయడం అభినందనీయమని ఆయన తెలియజేశారు.
మంత్రి పెద్దిరెడ్డి... మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా సదుం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం ఓటు వేశారు. పుంగనూరు బసవరాజ ఉన్నత పాఠశాలలో ఎంపీ రెడ్డప్ప ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమల పోలింగ్ కేంద్రానికి సమీపంలో వచ్చిన టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.