విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చతుర్వేద పండితులతో అత్యంత ఘనంగా వేదసభను మహా మండపం ఆరోవ అంతస్తులో నిర్వహించారు. ఈ సభలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం.గిరిజా శంకర్ పాల్గొన్నారు. మహర్నవమి పుణ్య దినాన వేదసభలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వేద పఠనం రాష్ట్ర పురోభివృద్ధి, దేవాలయాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని, వాటి మనుగడను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు కృషి చేస్తానని తెలిపారు.
వేదసభను వచ్చే ఏడాది మరింత అట్టహాసంగా నిర్వహిస్తామని కమిషనర్ పి. అర్జునరావు తెలిపారు. కరోనా వలన ఈ ఏడాది పరిమితి సంఖ్యలోనే నిర్వహించడం జరిగిందన్నారు. వేద పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహకాలు అందించి, వేదాల పరిరక్షణకు, వేద విద్య ప్రోత్సహించేందుకు చర్యలు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలతో సమన్వయం చేసుకుని..వాటి సిలబస్‌ను అన్ని వేద పాఠశాలల్లో భోదించేందుకు చర్యలు తీసుకుంటునట్లు కమిషనర్ తెలిపారు.