కొండరాళ్లు పడకుండా ఉండేందుకు మూడంచెల శాశ్వత ప్రణాళిక ఒక్కటే మార్గమని భూభౌతిక నిపుణుల కమిటీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి పైభాగంలో ఓ కాలువను నిర్మించి వర్షం నీరు రాళ్ల మధ్య నిలువ ఉండకుండా కిందకు వెళ్లేలా చేయడం, కొండపై పచ్చదనం పెరిగేందుకు హైడ్రో సీడింగ్, అవసరమైన ప్రాంతాల్లో డబల్ ట్విస్టెడ్ ఇనుప వలను వేయడం.. ఈ మూడు ఖచ్చితంగా చేయాలని సూచించారు. ప్రస్తుతం దుర్గగుడి అధికారులు నిపుణుల నివేదిక ప్రకారం ప్రతిపాదనలను రూపొందించి దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపిస్తారు. కొండ దిగువన ఓ రక్షణ గోడను కూడా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అనంతరం మరోసారి నిపుణుల కమిటీ ఇంద్రకీలాద్రికి రానుంది.
రాష్ట్ర దేవాదాయశాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మాధవ్, బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ శివకుమార్, భూ భౌతిక నిపుణులు త్రిమూర్తిరాజుతో కూడిన నలుగురు సభ్యుల బృందం వచ్చి డీపీఆర్‌ను రూపొందించనుంది. 600 మీటర్ల పొడవులో కొండకు ఎక్కడెక్కడ ఏ పని చేయాలి, దానికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలతో పక్కాగా డీపీఆర్ సిద్ధం చేస్తారు. ఆ తర్వాత టెండర్లను పిలిచాక.. పనులు ఆరంభమవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వడానికి డిసెంబర్ నెలాఖరు వరకు సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి పనులు ప్రారంభించి.. మేలోగా పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టారు. వర్షాకాలం ఆరంభం నాటికి పూర్తిగా పనులు పూర్తి చేయాల్సి ఉంది.