MAHILA SAMAAKHYA : న్యాయం కోసం ఢిల్లీలో నిరసన తెలుపుతున్న మహిళా క్రీడాకారులపై పోలీసుల లాఠీచార్జి చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని మండిపడ్డారు. మహిళా మల్లయోధుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ ప్రతిభా పాటవాలతో దేశానికి వన్నెతెచ్చిన మహిళ యోధుల పట్ల బీజేపీ ఎంపీ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న మల్లయోధులపై పోలీసుల లాఠీ చార్జీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తక్షణమే ఎంపీ శరన్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని, పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారత జాతీయ మల్లయోధుల సమాఖ్య అధ్యక్షుడు మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. నెల రోజులుగా ధర్నా చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరును మహిళలంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశానికి పతకాలు తీసుకువచ్చిన మల్ల యోధులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాం. తాను ఏ తప్పూ చేయలేదంటున్న బ్రిజ్ భూషణ్ విచారణకు ఎందుకు సిద్ధంగా లేడు.. పైగా ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా చెప్తే రాజీనామా చేస్తానని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి..? బాధితులే నేరుగా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా న్యాయం దక్కడం లేదు. పైగా సాక్ష్యాధారాలు అడగడంలో ఆంతర్యమేంటని మేం ప్రశ్నిస్తున్నాం. నిందితులపై కేసులు నమోదు చేయకుండా బాధితులపైనే ఆరోపణలు చేయడం విచారకరం. మోదీ, అమిత్ షా అండదండలతోనే బ్రిజ్ భూషణ్ ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. దేశ ప్రతిష్టకు మచ్చ తీసుకువచ్చే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా..? దేశానికే అవమానం కాదా..? ప్రభుత్వానికి క్రీడాకారులకు న్నాయయం చేయాలన్న ఉద్దేశం లేదనిపిస్తోంది. - పి.దుర్గా భవాని, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి