బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజి వద్దకు 60,000 క్యూసెక్కుల వరద నీరు చేరుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజా స్వరూప్ కుమార్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉదయం 9 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 22,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశామని.. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఆయన సూచించారు. కృష్ణానది, కృష్ణా డెల్టా కాలువ ప్రాంతాల జలవనరుల శాఖ అధికారులు... కిందిస్థాయి సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.. ప్రమాదాల నివారణ కోసం కాలువ కట్టలు, వరద కరకట్టలు... ఇతర నిర్మాణాలను తనిఖీ చేసి వెంటనే అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆయన సూచించారు.