DSPs transfers : అధికార పార్టీ నాయకుల అరాచకాలను చూసీచూడనట్లు ఉంటారని, ప్రతిపక్షపార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడతారనే విమర్శలున్న అధికారులకు తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీల్లో కీలక పోస్టింగులు దక్కాయి. వివాదాస్పద అధికారులుగా పేరొందిన పలువురికి బదిలీల్లో బాగా ప్రాధాన్యం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారిలో 50 మందిని వివిధ పోలీస్ సబ్ డివిజన్లలో ఎస్డీపీఓలుగా నియమించారు. పోలీసు శాఖలో వీటిని బాగా ప్రాధాన్యమైన పోస్టులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వేర్వేరు సబ్‌డివిజన్లలో ఎస్డీపీఓలుగా పనిచేస్తున్న 20మంది డీఎస్పీలకు తాజా బదిలీల్లో కూడా ఎస్డీపీఓలుగా పోస్టింగులు లభించాయి. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదే సమయం ఉన్నందున పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తారనే పేరున్న వారిని కీలక స్థానాల్లో నియమించారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వీరే కీలక విధుల్లో కొనసాగే అవకాశం ఉంటుంది.
బాధితులపైనే రివర్స్ కేసులు.. రాష్ట్ర చరిత్రలోనే ఎవరిపైనా లేనన్ని వివాదాలు తాడిపత్రి డీఎస్పీ చైతన్యపై ఉన్నాయి. అలాంటి అధికారిని తాజా బదిలీల్లో.. అత్యంత ప్రాముఖ్యత ఉన్న రాజంపేట సబ్‌డివిజన్ పోలీసు అధికారి ఎస్డీపీఓగా నియమించారు. 2018 బ్యాచ్ గ్రూపు-1 అధికారైన చైతన్య... తాడిపత్రి ఎస్డీపీఓగా తొలి పోస్టింగు చేపట్టి రెండున్నరేళ్లుగా అక్కడే కొనసాగుతున్నారు. ఆయనపై ఎన్ని ఫిర్యాదులు, విమర్శలొచ్చినా సరే వాటిని లెక్కచేయకుండా మరోసారి ప్రాధాన్యత కలిగిన పోస్టింగే ఇచ్చారు. తాడిపత్రిలో అధికార పార్టీ, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పూర్తిగా కొమ్ముకాస్తూ పనిచేశారన్న విమర్శలు చైతన్యపై ఉన్నాయి.
అధికార వైఎస్ఆర్ పార్టీ నాయకుల వల్ల అన్యాయం జరిగిందని, వారు దాడి చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టటం, పాత కేసులు తిరగదోడటం చేసేవారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెద్దఎత్తున కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదులున్నాయి. పలువుర్ని కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారు. చైతన్య బాధితులు ఆయనపై న్యాయస్థానాల్లో ఏడు ప్రైవేటు కేసులు దాఖలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న తనను డీఎస్పీ చైతన్య ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో వేధించారంటూ నర్రెడ్డి జగదీశ్వర్‌రెడ్డి గతంలో సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అరాచకాలకు వత్తాసు పలికినందునే అందుకు బహుమానంగా తాజా పోస్టింగు దక్కించుకున్నారన్న విమర్శలున్నాయి.
మంత్రి అండదండలతో... కాశీబుగ్గలో అధికారపార్టీ అరాచకానికి అండగా నిలిచిన ఎం.శివరామిరెడ్డి.. వైఎస్సార్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే 2019 జులై 17న జరిగిన బదిలీల్లో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎస్డీపీఓగా నియమితులయ్యారు. మూడున్నరేళ్లుపైనే ఈ పోస్టులో కొనసాగిన శివరామిరెడ్డిని తాజా బదిలీల్లో విశాఖపట్నం పోలీసు కమిషనరేట్ పరిధిలో నార్త్ జోన్ ఏసీపీగా అత్యంత ప్రాధాన్యత కలిగిన సబ్‌డివిజన్‌లో నియమించారు. కాశీబుగ్గ డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో పలాస, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి, వారిని వేధించారన్న ఆరోపణలున్నాయి. మంత్రి అప్పలరాజు అండ చూసుకుని చెలరేగిపోయారన్న విమర్శలున్నాయి. పలాస నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రతిపక్షాల వారిని వేధించారన్న ఆరోపణలున్నాయి. ఆ సేవలకు మెచ్చే మరోసారి ఆయనకు కీలక పోస్టింగు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం సొంత జిల్లా.. రామచంద్రాపురం ఎస్డీపీఓ బాలచంద్రారెడ్డి.. సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన వారు. 2018 బ్యాచ్ గ్రూపు1 అధికారైన ఆయన..అరసవల్లికి పాదయాత్రగా వెళ్తున్న అమరావతి రైతులపై దురుసుగా ప్రవర్తించి అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. రామచంద్రాపురంలోని ఓ ప్రైవేట్ స్థలంలో నిలిపిన అమరావతి రైతుల దివ్యరథానికి కాపలాగా ఉన్న వారిని కొట్టి రథంలోని సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు తీసుకెళ్లారు. సాధారణ దుస్తుల్లో వెళ్లి వారిపై జులుం ప్రదర్శించారు. అధికార పార్టీకి అనుకూలంగా కొమ్ముకాసి పనిచేస్తారన్న ఆరోపణలున్నాయి. అలాంటి వివాదాస్పద అధికారిని తాజా బదిలీల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కొత్తగా ఏర్పాటైన పోలీసు సబ్‌డివిజన్లో ఆయన్ను ఎస్డీపీఓగా నియమించారు.