బస్తా... రెండుబస్తాలు కాదు... ఏకంగా పదుల సంఖ్యలోనే బస్తాల కొద్దీ దొండలను కుప్పలుగా పారబోస్తున్నారు. కేజీల లెక్కన కాకుండా టన్నుల కొద్దీ పంట దిగుబడిని పొలం గట్టు శివారులోనూ కాలువల్లోనో చెత్తకుప్పల్లోనూ పడేస్తున్నారు. ఇదంతా కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో దొండ సాగు చేస్తోన్న రైతుల ప్రస్తుత పరిస్థితి.
చిన ఓగిరాల, పెద ఓగిరాల చుట్టుపక్కలే సుమారు 200 ఎకరాలకుపైగా దొండకాయ సాగు చేశారు. రోజుకి 15 వందల బస్తాలకు పైగా దొండకాయలు మార్కెట్ కి వస్తాయి. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాలకు దొండ ఎగుమతి చేస్తుంటారు. నాలుగు నెలలుగా కరోనా మహమ్మారితో ముఖ్యంగా కూరగాయల రైతులు వారి పంట విక్రయాలకు నానా అవస్థలు పడుతున్నారు.
కూరగాయలు అమ్ముకునేందుకు పరిమిత కాల వ్యవధినే ప్రభుత్వం ప్రకటించడంతో.... రైతులు ఏ రోజుకారోజూ కోసిన దొండకాయలను పూర్తిగా విక్రయించలేకపోతున్నారు. ముందురోజు కోసిన దొండకాయలను మార్కెట్లోకి తరలిస్తే నాణ్యత సరిగా లేదని కొనుగోలుకు ఎవరూ ఇష్టపడడంలేదు.
ఇతర కూరగాయ పంటల కంటే దొండ పంటకు పెట్టుబడులు ఎక్కువ కావటంతో... ప్రస్తుత పరిస్థితులలో వివిధ రకాలుగా రైతులు లక్షల రూపాయల్లో నష్టాలు మూటకట్టుకోవాల్సి వస్తోంది. దొండకాయ కోసినా నష్టమే, కోయకుండా పందిళ్లకు ఉంచినా నష్టమే అన్నట్లు ఉంది.