ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు టీసీలు అవసరం లేకుండానే ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విద్యార్థి ఆధార్ నంబర్ ఉంటే చాలు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడులకు వస్తున్న విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలియడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
కృష్ణా జిల్లా నిడమానూరు జడ్పీ ఉన్నత పాఠశాలను, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని జడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకుంటున్నందున ఏర్పాట్లు పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యా సంవత్సరం చాలా కోల్పోయినందున.. పనిదినాలను పెంచి, పాఠ్యాంశాలను కుదించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నాటికి విద్యా సంవత్సరం పూర్తి చేసి విద్యార్థులు ఎవరికీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.