పాఠశాలల్లోని హాజరుపట్టీల్లో విద్యార్ధుల కుల, మతాలను పేర్కొనవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అంతర్గత సర్కులర్ జారీ చేసింది. విద్యార్థుల పేర్లను నమోదు చేసే హాజరుపట్టీల్లో ఎక్కడా కులమతాలు ప్రస్తావించటం... బాలికల పేర్లను ఎర్ర సిరాతో రాయడం చేయొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సర్కులర్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ హాజరుపట్టీ నిర్వహణకు సంబంధించి ఏకరూప విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని సిబ్బందికి తక్షణం ఈ అంశాలపై అవగాహన కల్పించాలంటూ ప్రాంతీయ జాయింట్ డెైరెక్టర్లను, జిల్లా విద్యాధికారులను ఆదేశిస్తూ ఈ అంతర్గత సర్కులర్ జారీ చేశారు.
మండల, జిల్లా స్థాయిలో విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలల్లోని వివిధ అంశాలపై నిర్వహించే సర్వేల కోసం హాజరుపట్టీల్లో కుల, మతాలను ప్రస్తావిస్తున్నట్టుగా ఫిర్యాదులు రావటంతో దీన్ని ఉపసంహరించుకుంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.