Congress new committees new problems: కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన కొత్త కమిటీలపై తెలంగాణ నాయకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియర్లను సంప్రదించకుండా ఏకపక్షంగా కమిటీలు వేశారని అందులో అనర్హులకే పెద్ద పీట వేశారంటూ మండిపడుతున్నారు. పార్టీలో దీర్ఘకాలంగా పని చేస్తున్న తమకు ఎందుకు అవకాశమివ్వలేదని పలువురు నిలదీస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు తీసుకున్న నిర్ణయం వల్లే తప్పిదాలు జరిగాయని నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించకపోవడంతో పీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యత్వానికి కొండా సురేఖ, పీసీసీ అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్య నాయక్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమైన కొందరు పార్టీ సీనియర్లు కమిటీల ఏర్పాటులో జరిగిన తప్పిదాలపై చర్చించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే కమిటీల్లో గందరగోళం చోటుచేసుకుందని పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం పీసీసీ అధ్యక్షుడు సహా సీఎల్పీ నేతను కమిటీ కూర్పులో భాగస్వామ్యం చేయాల్సి ఉన్నా తనకు తెలియకుండానే ఏర్పాటు చేశారని భట్టి విక్రమార్క వెల్లడించారు. అలా ఎందుకు జరిగిందనేది రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌కే తెలియాలని భట్టి వ్యాఖ్యానించారు. అవసరమైతే దిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసి కమిటీల ఏర్పాటుపై చోటు చేసుకున్నపరిణామాలు తద్వారా రాష్ట్ర పార్టీకి జరిగే నష్టంపై తెలియచేయాలని సీనియర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.