సాధారణంగా కాలువల గట్లను తవ్వేందుకు అనుమతులు ఉండవు. కానీ విజయవాడ మండలం నున్న సమీపంలో ఉన్న పోలవరం కాలువ గట్లపై గ్రావెల్ ఎక్కువైందనే సాకుతో ఎడాపెడా అనుమతులు ఇస్తున్నారు. కాలువ గట్లు మాత్రమే కాదు.. కొండ ప్రాంతాలకూ నేతలు ఎసరు పెడుతున్నారు. కొన్ని కొండలను తవ్వేందుకు అనుమతుల కోసం గనులు, భూగర్భ జలవనరుల శాఖకు దరఖాస్తులు చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, మంత్రులు వీటిని దక్కించుకునేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే జక్కంపూడి, షాబాద్ కొండలను పిండి చేసిన గ్రావెల్ మాఫియా ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలోని కొండలపై దృష్టి పెట్టింది.
జిల్లాలో గ్రావెల్‌కు డిమాండు బాగా పెరిగింది. నిరుపేదలకు ఇచ్చే నివేశన స్థలాల చదునుకు భారీగా గ్రావెల్ అవసరం. ఇవి వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సి ఉన్నా గుత్తేదారులకు ఇస్తున్నారు. క్వారీ లీడ్‌లు చూపిస్తున్నారు. వీరి దృష్టి పోలవరం కాలువపై పడింది. జిల్లాలో పోలవరం కాలువ సుమారు 66 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం ఇది పట్టిసీమ నుంచి 8,500 క్యూసెక్కుల నీటిని తీసుకువస్తుంది. కానీ దీని సామర్థ్యం ఎక్కువ. 2005లోనే పోలవరం కాలువ తవ్వడం ప్రారంభించారు. 2015లో దీన్ని పూర్తి చేసి పట్టిసీమకు నీరు విడుదల చేయించారు. కాలువ తవ్విన మట్టి కట్టగా పోశారు. ఇప్పుడు ఈ కట్టలను ఎత్తేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వీటిని తవ్వుతున్నారు. కొన్నింటికి అనుమతులు తీసుకున్న గుత్తేదారులు కట్టలు మొత్తం మాయం చేస్తున్నారు. ఒక ట్రిప్పునకు రశీదు ఉంటే.. పది ట్రిప్పులు తవ్వుతున్నారు. గ్రావెల్ తవ్వకాలు రాత్రిపూట నిషేధం. కానీ పోలవరం కట్టవెంట రాత్రీపగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. కొన్ని ఇళ్ల స్థలాల చదునుకు వెళుతుంటే.. మరికొన్ని ప్రైవేటు ప్రాంతాలకు తరలిస్తున్నారు. జలవనరుల శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ తీసుకుని గనుల శాఖ వద్ద అనుమతులు పొందారు. పోలవరం కట్టపై మొత్తం నీటిపారుదల శాఖ 113 ప్రాంతాల్లో నీటిపారుదల శాఖ ద్వారా ఇచ్చిన 4.8లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కంటే ఎక్కువగా తవ్వేశారు. అనుమతి కంటే పదిరెట్లు తరలిస్తున్నారు.