Digi Yatra services started at Vijayawada International Airport: మానవ ప్రమేయం లేకుండా విమానాశ్రయాల్లో వేగంగా చెకిన్ కొరకు డిజిటల్ తనిఖీలో భాగంగా ఏర్పాటు చేసిన 'డిజియాత్ర' యాప్ సేవలను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారు. యాప్ ఉపయోగాలను విమానాశ్రయ డైరెక్టర్ ఎమ్. లక్ష్మీకాంతరెడ్డి వివరించారు. ఆండ్రాయిడ్ ఆధారిత 'డిజియాత్ర' బీటా వెర్షన్ మొబైల్ అప్లికేషన్ సేవలు శుక్రవారం నుంచి విజయవాడ విమానాశ్రయంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) ద్వారా ప్యాసింజర్ ప్రాసెసింగ్ సిస్టమ్ జరుగుతుందని, ఈ సదుపాయం వల్ల ప్రయాణికులు వేగంగా చెక్ ఇన్ కావచ్చని తెలిపారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే: ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేందుకు ముందుగా ప్రయాణికులు 'డిజి యాత్ర' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ప్రయాణికులు తమ ఆధార్ నెంబర్ ద్వారా యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. ఆధార్ కార్డ్‌తో సెల్ఫీ తీసుకోవాలి. తరువాత సదరు ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్‌ను క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌తో స్కాన్ చేయాలి. దీంతో ప్రయాణికుల వివరాలు సంబంధిత విమానాశ్రయానికి చేరతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ప్రయాణికులు ఈ - గేట్ వద్ద తమ బోర్డింగ్ పాస్‌లను స్కాన్ చేయాలి, అక్కడ ఏర్పాటు చేసిన ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కెమెరాను చూడటం ద్వారా మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీంతో ప్రయాణికులు సులభంగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు.