కృష్ణా జిల్లా నందిగామలో రైతుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి విజయవాడకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వారికి ఎదురెదురుగా కంచికచెర్ల వైపు నుంచి నందిగామకు మరో వ్యక్తి బైక్ మీద వచ్చాడు. రెండు ద్వి చక్రవాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురుకీ తీవ్ర గాయాలు అయ్యాయి. 108, టోల్గేట్ అంబులెన్సు స్పందించకపోవడంతో సరకు రవాణా ఆటోలో వీరిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం వీరిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
గన్నవరం మండలం దావాజీగూడెం బుద్ధవరం ప్రధాన రహదారిపై బైక్ పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అజ్జాపూడి గ్రామానికి చెందిన నవ్వులూరి కాంత్రి కుమార్ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.