Sand Contractors Dharna: వైసీపీ అధికారంలోకి వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించిన తమకు నిరాశే ఎదురవుతోందని ఏపీలో ప్రభుత్వ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)కు ఇసుక రవాణా, లోడింగ్ చేసిన గుత్తేదారులు వాపోతున్నారు. మూడేళ్ల నుంచి తమకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అవేదన చెందుతున్నారు. తాము చేసిన పనికి సంబంధించి బిల్లులు చెల్లించడం లేదని వారు మండిపడుతున్నారు.
పట్టించుకోని అధికారులు: పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట ఇసుక రవాణా, లోడింగ్ గుత్తేదారులు ఆందోళనకు దిగారు. తాడిగడప 100 అడుగుల రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గుత్తేదారులు ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు తమను హీనంగా చూస్తున్నారని గుత్తేదారులు అవేదన చెందున్నారు.
అప్పులు తీసుకొచ్చి ఇసుక సరఫరా: తాము బిల్లులు అడుగుదామని వెళ్లితే తమను లోనికి కూడా అనుమతించడం లేదని తెలిపారు. తాము ఖనిజాభివృద్ది సంస్థకు ఇసుకను సరఫరా చేశామని, సంస్థ ఆ ఇసుకును కూడా విక్రయం చేసిందని మరి మాకు బిల్లులు ఇవ్వడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అప్పులు తీసుకువచ్చి ఇసుకను సరఫరా చేశామని, అప్పు ఇచ్చిన వారు తమను వేదింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. బిల్లులు చెల్లించాలని కోరుతూ సంస్థ కార్యాలయం చూట్టు తిరుగుతున్నా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనేక సార్లు మాట మార్చిన అధికారులు: అప్పులు బాధలు తట్టుకోలేక తాము గతంలో ఇదే కార్యాలయం ముందు అనేక సార్లు ధర్నా చేయడం జరిగిందని గుత్తేదారులు తెలిపారు. అప్పుడు ధర్నా చేసిన సమయంలో 2023 ఫిబ్రవరి 25 లోపు గుత్తేదారుల బకాయి బిల్లులను చెల్లిస్తామని అధికారులు హమీ ఇచ్చినట్లు వారు చెప్పారు. తర్వాత మార్చి ఆర్ధిక సంవత్సరం ముగింపు లోపలే బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పారని గుత్తేదారులు చెబుతున్నారు. తర్వాత ఏప్రిల్ 10 లోపు ఇస్తామని హమీ ఇచ్చారని, అధికారులు హమీ ఇచ్చారు.. ఇంక మా బిల్లులు వస్తాయి.. తమకు ఆర్ధిక కష్టాల నుంచి విముక్తి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని గుత్తేదారులు పెర్కొన్నారు. అధికారులు ఇచ్చిన హమీలు గాలిలో కలిసిపోయాయని మండిపడుతున్నారు.