రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు నిరంతరం చర్యలు తీసుకుంటోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేశామని ఆయన అన్నారు. కిరాణా, ఇతర నిత్యావసర వస్తువులు.. పౌరులకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వెల్లడించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాకని ఆయన అన్నారు. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ , కుటుంబంలో మరణం, సామాజిక పనుల కోసం, ప్రభుత్వ విధి నిర్వహణ ఇతర అత్యవసరమైన వాటి కోసం ప్రయాణించడానికి ఇక్కట్లు పడుతునట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయని, ఈ సమస్యలను పరిష్కరించడానికి.. ప్రయాణానికి అవసరమైన వారికి పాస్ ఇవ్వాలని పోలీసు శాఖను ఆదేశించారని తెలిపారు. ముఖ్యమైన పని నిమిత్తం మాత్రమే ప్రజలు, పౌరులు (ఈ-పాస్)ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. అత్యవసర పాస్‌ల కోసం అభ్యర్థించే వారు పూర్తి సమాచారాన్ని అందించాలని తెలిపారు.
- ఫొటోతో పాటు పూర్తి పేరు, మొబైల్ నంబర్
- మెడికల్ సర్టిఫికెట్లు, అధికారిక లేఖల/ పత్రాల అప్‌లోడ్.
- ఆధార్ అప్‌లోడ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు
- పూర్తి ప్రయాణ వివరాలు.
- ప్రయాణించే వాహన పూర్తి వివరాలు, ప్రయాణీకుల సంఖ్య. కారుకు (1+3) అనుమతి.
Https: citizen.appolice.gov.in వెబ్‌సైట్‌లో పైన పేర్కొన్న అన్ని వివరాలతో కోవిడ్ -19 అత్యవసర వాహన ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసారు. ఈ-పాస్ ఆమోదించబడితే దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్ నెం లేదా, మెయిల్ ఐడీకి ఈ-పాస్ పంపుతామని తెలిపారు. వెబ్‌సైట్ నుంచి జారీ చేసిన అత్యవసర పాస్‌లు మాత్రమే అంగీకరించబడతాయని పేర్కొన్నారు. అత్యవసర వాహన పాస్‌తో పాటు, పౌరులు ప్రయాణించేటప్పుడు వారి ఒరిజినల్ ఐడీ కార్డును కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు. సమర్పించిన వివరాల ధృవీకరణ తరువాత, వీలైనంత త్వరగా ఈ-పాస్ జారీచేస్తారన్న అయన తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.