కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై తెదేపా నేత, మాజీమంత్రి దేవినేని ఉమ మరోసారి మండిపడ్డారు. కొండపల్లి అటవీ భూముల్లో తవ్వకాలపై తాను ప్రశ్నిస్తుందనే కృష్ణప్రసాద్ నిరాశకు గురవుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే అవినీతి వల్ల ప్రభుత్వ అధికారులు సస్పెండ్ అయ్యారని ఆరోపించారు. తెదేపా హయాంలో నీటిపారుదల శాఖలో అవినీతి జరగలేదని కేంద్రం చెబుతున్నా... వైకాపా నేతలు కావాలనే తనపై బురదల జల్లుతున్నారని అన్నారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అవినీతిని తేల్చడానికే ఏసీబీ అధికారులను ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వద్దకు జగన్ పంపించారని దేవినేని ఉమ చెప్పారు. మునగపాడులో పేదల కోసం కొన్న భూముల్లో ఎమ్మెల్యే అక్రమాలు చేశారని ఆరోపించారు. వీటిపై బహిరంగ చర్చను తాడేపల్లిలోని సీఎం ఇంటి దగ్గర పెట్టుకుందామని సవాల్ విసిరారు. మరోవైపు మంత్రి కొడాలి నానిపైన దేవినేని ఉమ మండిపడ్డారు. మంత్రి స్థానంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి చంద్రబాబుపై అసభ్యంగా విమర్శలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.