కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమాను పోలీసులు అరెస్టు చేశారు. గొల్లపూడి సెంటర్‌కు పలువురు వైకాపా కార్యకర్తలు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గందరగోళం మధ్య ఎన్టీఆర్ విగ్రహం వద్ద దేవినేని ఉమ బైఠాయించారు. ఈ క్రమంలో దేవినేని ఉమను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఈలప్రోలు నుంచి మాజీమంత్రిని ఇబ్రహీంపట్నం తరలించారు. విజయవాడ పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఇబ్రహీంపట్నం వద్దకు పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు చేరుకున్నారు. దీంతో పోలీసులు అక్కడినుంచి విజయవాడ మీదుగా తొట్లవల్లూరు వైపు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పమిడిముక్కల పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. తక్షణమే ఉమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను గృహనిర్బంధం చేశారు.
అంతకుముందు దేవినేని ఇంటి వద్దకు రాకుండా తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని తెలిపారు. దేవినేని ఉమ నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇంటికి వెళ్లే మార్గాల వద్ద బారికేడ్లు పెట్టి అనుమతించలేదు.