ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం దుర్గమ్మ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనం ఇవ్వనుంది. బాలా త్రిపురసుందరీదేవిని దర్శించుకుంటే పూర్ణఫలం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం. బాలాదేవి మహిమాన్వితమైనది. బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది. ముఖ్యమైనది. అందుకే విద్యోపాసనకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువై ఉండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే దేవత శ్రీబాలాత్రిపుర సుందరీదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని ప్రతీతి.
కొవిడ్ నేపథ్యంలో మొదటిరోజు నిబంధనల మధ్య భక్తులు తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ఆరంభమైంది. మొదటి రోజు అమ్మవారికి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిచ్చారు. అప్పటికే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సాయంత్రం 6గంటల సమయానికి 9వేల మంది భక్తులు తరలివచ్చి స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ వెల్లడించారు. మొదటి రోజు ఉదయం నుంచి క్యూలైన్లు ఖాళీగానే ఉన్నాయి. సాయంత్రం నుంచి భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది. ఐదు క్యూలైన్లలో కొండపైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని నేరుగా కిందకు వెళ్లిపోయారు. సాయంత్రం వరకు ప్రసాదాల విక్రయం ద్వారా రూ.4లక్షల ఆదాయం సమకూరింది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకోని భక్తుల సౌకర్యార్థం నగరపాలక సంస్థ కార్యాలయం, పున్నమిఘాట్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా స్వామినాయుడు తెలిపారు.