కొవిడ్ విధులకు వెళ్లం మేడం అంటూ నర్సింగ్ విద్యార్థులు కళాశాల యాజమాన్యాన్ని కోరిన సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి డాక్టర్ శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. కళాశాల 4వ ఏడాది నర్సింగ్ విద్యార్థుల్లో ఇతర రాష్ట్రాల వారిని తల్లిదండ్రుల కోరిక మేరకు ఇళ్లకు పంపిన యాజమాన్యం, స్థానిక విద్యార్థులను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు తరగతులు, క్లినిక్ కింద కొవిడ్ ఆసుపత్రి విధులకు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత అంగీకరించిన విద్యార్థినుల్లో కొందరు.. నిన్న ససేమిరా అనడంతో ఒకింత ఆందోళన వాతావరణం నెలకొంది. సదరు విద్యార్థినులకు కరోనా విపత్కర పరిస్థితులో నర్సింగ్ విద్యార్థులుగా మనం తప్ఫ. ఎవరూ ముందుకొస్తారంటూ కళాశాల ప్రిన్సిపల్ వందన అవగాహన కల్పించడంతో తిరిగి విధులకు వెళ్లేందుకు విద్యార్థినులు ఒప్పుకున్నారు. నర్సింగ్ కళాశాల విద్యార్థులను యాజమాన్యం కొవిడ్ విధులకు బలవంతం పెట్టినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని వందన పేర్కొన్నారు. 34 మంది కళాశాల విద్యార్థినులు కరోనా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్ సేవలందిస్తున్న సిద్ధార్థ నర్సింగ్ విద్యార్థినులను పిన్నమనేని వైద్య కళాశాల యాజమాన్యం, రాష్ట్ర కొవిడ్ నియంత్రణ వైద్య బృందం ప్రత్యేకంగా అభినందించింది.
పిన్నమనేనిలో నర్సుల కొరత