రాఖీ పండగ వస్తే చాలు.. ఎక్కడెక్కడో ఉన్న అన్నదమ్ముల దగ్గరకి ఎంతో అపురూపంగా చేరుకుంటారు అక్కాచెల్లెళ్లు. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగలో వినియోగించే రాఖీలు పర్యావరణానికి హాని చేస్తున్నాయని,... కృత్రిమ రంగులు, ప్లాస్టిక్ వినియోగించి తయారు చేసే రాఖీలు కాలుష్యానికి కారణం అవుతున్నాయి అంటున్నారు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఏకో క్లబ్ విద్యార్ధినులు. ఇంట్లో దొరికే వస్తువులతో వివిధ రకాల పర్యావరణహిత రాఖీలు తయారు చేసి ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఉంచిన రాఖీలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సహజ వనరులతో తయారు చేసిన రాఖీలు కట్టేద్దాం.. - ప్రతీక
రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. తనకు జీవితాంతం అండగా ఉంటూ రక్షణ కల్పించాలని కోరుతూ అన్నదమ్ములకు చెల్లెళ్లు ప్రేమతో రాఖీ కట్టే పండగ. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఏడాది కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే.. పర్యావరణాన్ని కలుషితం చేయకుండా సహజసిద్ద వనరులతో తయారుచేసిన రాఖీలు ఉపయోగిస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవాళ్లం అవుతామంటున్నారు విజయవాడ విద్యార్థినులు.
సహజ వనరులతో రాఖీల తయారీ
పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రకృతిలో లభించే సహజ వనరులతో విద్యార్థినీలు రాఖీలు తయారు చేశారు. సహజ వనరులతో తయారుచేస్తే అవి మట్టిలో కలిసిపోతాయని.. విత్తనాలు, పప్పుదినుసులు ఉపయోగించి తయారు చేసిన రాఖీలు తర్వాత పడేస్తే అందులోని విత్తనాలు మొలకెత్తి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుతాయని విద్యార్థులు పేర్కొన్నారు. పట్టు, నూలు దారాలు, ఊలు, ఆకులు, సగ్గుబియ్యం, అటుకులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, లవంగాలు, ఆవాలు, రాగులు, కాగితం, పూలను ఉపయోగించి ఆకర్షణీయంగా తయారు చేసిన రాఖీలను ప్రదర్శన అమ్మకానికి పెట్టారు. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ప్రదర్శనను తిలకించి రాఖీలను కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి:పట్టుదలతో చదివాడు... బంగారు పతకాలు సాధించాడు