ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల నమోదులో జాప్యం... లోపిస్తున్న పాఠశాల నిర్వహణ - transfer of teachers news

విద్యాశాఖ ప్రస్తుతం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, మరోవైపు విద్యార్థుల ప్రవేశాలతో పాఠశాలల్లో బోధన ప్రశ్నార్థకమవుతోంది. కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలంలో ఈ సమస్య విద్యార్థులు అధికంగా ఉన్న పలు పాఠశాలల్లో కనిపిస్తోంది. ప్రధానంగా జిల్లాలో విద్యార్థుల అడ్మిషన్లలో తొలి మూడు స్థానాల్లో నిలిచే విస్సన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇది చర్చనీయాంశంగా మారింది.

class room
పాఠం వింటున్న విద్యార్థులు

By

Published : Dec 3, 2020, 9:22 AM IST

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో చేపట్టిన పలు మార్పులే పాఠశాలల్లో సమస్యకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గత విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బదిలీలు చేపడతామంటూ తొలుత ఆదేశాలిచ్చినా, ఈ ఏడాది పాఠశాల ప్రారంభంనాటికి ఉన్న సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటున్నామంటూ మరోమారు మార్పు చేశారు. ఈ నేపథ్యంలో పలు విద్యాలయాల్లో విద్యార్థుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేయటంలో జాప్యం నెలకొంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు మరో ఇబ్బందిగా మారాయి.

విస్సన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్దేశిత తేదీ (నవంబరు 2) నాటికి విద్యార్థుల సంఖ్య 638 మంది ఉండగా, అంతర్జాలంలో 588 మంది మాత్రమే నమోదయ్యారు. నవంబరు 2వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా కొత్తగా పాఠశాలకు వచ్చేవారితో ఈ సంఖ్య మరింత పెరిగి తాజాగా 700 మంది పైచిలుకు విద్యార్థులున్నారు. గతంలో 588 మందినే పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులను ఇక్కడ పరిమితం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే, సుమారు అయిదుగురు ఉపాధ్యాయులు బదిలీ అవుతారు. ఇదే జరిగితే 200 మంది విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉండని పరిస్థితి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మండలంలో ప్రవేశాలు గణనీయంగా పెరిగిన తెల్లదేవరపల్లి, కొండపర్వ పాఠశాలల్లో తలెత్తే ప్రమాదం ఉంది.

అధికారులేమన్నారంటే...

తమ పాఠశాల విద్యార్థులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో సర్వర్‌ సమస్య ప్రధానంగా మారిందని జడ్పీ పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వరమ్మ తెలిపారు. టీసీ లేకున్నా, అడ్మిషన్లు ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా, నిర్దేశిత సమయంలోగా విద్యాశాఖ కార్యాలయంలో వీరి పేర్లను ఇతర పాఠశాలల నుంచి తొలగించకపోవటం కూడా మరో సమస్యగా మారిందన్నారు. ఈ విషయమై విచారణకు వచ్చిన నూజివీడు ఉప విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారిని విచారించగా, విస్సన్నపేటతోపాటు, మరికొన్ని పాఠశాలల్లో ఇదే సమస్య ఉందన్నారు. దీన్ని పరిష్కరించే దిశగా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని, నివేదిక ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రెండు రాష్ట్రాలకు అనుసంధాన దారి..అభివృద్ధికి వారధి

ABOUT THE AUTHOR

...view details