Decreasing Covid Tests: కొవిడ్ కేసులకు తగ్గట్టు నమూనాల పరీక్షలు పెరగడంలేదు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న విశాఖ, చిత్తూరు జిల్లాల్లోనూ నమూనాల పరీక్షలు పరిమితంగానే జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి ప్రతిరోజూ రాష్ట్రంలో 30 నుంచి 35 వేల వరకు మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ లక్ష నుంచి 1.20 లక్షల వరకు పరీక్షలు చేసే సామర్థ్యం వైద్య ఆరోగ్య శాఖకు ఉంది. తొలి, మలివిడత కొవిడ్‌లో కొత్త కేసు బయటపడగానే... వారితో సన్నిహితంగా మెలిగిన ప్రథమ, ద్వితీయ వ్యక్తులను గుర్తించి వారికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఫలితంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఏర్పడింది. పట్టణాలు, గ్రామాల్లోనూ పరీక్షల కేంద్రాలు అనుకున్నట్లుగా కనిపించడం లేదు. విజయవాడ వరకు చూస్తే తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఎన్టీఆర్ స్టేడియంలో మాత్రమే నమూనాలను సేకరిస్తున్నారు. సచివాలయాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ సౌకర్యం ఉన్నట్లు కృష్ణా జిల్లా అధికారులు చెబుతున్నా... పూర్తిస్థాయిలో అమలవడంలేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నా నిర్లక్ష్యమేనా... పరీక్షలను పెంచరా? అని ప్రశ్నిస్తున్నారు.
‘మ్యూటెంట్’ ఏదో చెప్పడానికి రూ.800...
బాధితులు ప్రైవేటుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు అధికంగా చేసుకుంటున్నారు. ఒక్కో దానికి రూ.475 మాత్రమే తీసుకోవాల్సి ఉన్నా... రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే... సోకింది ‘ఒమిక్రాన్’ వేరియంటా? కాదా? అని చెప్పడానికి అదనంగా రూ.800 చెల్లించాలని విజయవాడలో ఓ ప్రైవేట్ ల్యాబు వారు ప్రచారం చేయడం గమనార్హం. రాష్ట్రంలో 40 ప్రైవేటు ల్యాబుల్లో ఆర్టీపీసీఆర్ చేసేందుకు అవకాశముంది. వీటిలో చేసే ప్రతి పరీక్షకూ అధికారికంగా నమోదు చేయాల్సి ఉన్నా... పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఆచరణలో జరగడంలేదు. ఫలితంగా అనధికారిక కొవిడ్ కేసులు అధికంగానే ఉంటున్నాయి.
వ్యాక్సినేషన్‌పైనే అధిక దృష్టి..